నెల్లూరు: నెల్లూరు జిల్లా సముద్ర తీరంలో బోటు కలకలం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థం తీరాన శ్రీలంకకు చెందిన బోటు ప్రత్యక్షమవ్వడంతో అంతా ఒక్కసారిగా భయాందోళన చెందారు. 

బోటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది కాకపోడంతోపాటు, ఖాళీగా దర్శనమివ్వడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బోటు దగ్గరకు వెళ్లి పరిశీలించి చూడగా అది ఖాళీగా ఉండటంతో పోలీసులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

అలాగే బోటుపై శ్రీలంక అడ్రస్ ఉండటంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ బోటులో ఉగ్రవాదులు వచ్చి ఉంటారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షార్ లో బుధవారం సీఎస్ఎల్వీ  రాకెట్ ప్రయోగం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 

శ్రీలంక జిల్లా నుంచి నెల్లూరు వరకు శ్రీలంకకు చెందిన బోటు రావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదుల స్థావరాలు కనిపెట్టడం, వాటికి సంబంధించిన డేటాను శోధించేందుకు బుధవారం షార్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సి 46ను ప్రయోగిస్తున్నారు. 

ఈ రాకెట్ ప్రయోగం వల్ల ఉగ్రవాదుల ఆగడాలు కష్టమని తెలిసి వారు షార్ దగ్గర ఏదైనా కుట్ర చేసేందుకు శ్రీలంకలో చొరబడ్డ ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించారా అన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. 

దీంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. సముద్ర తీర ప్రాంతంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. హోటల్స్, లాడ్జీలు అన్నింటిని క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు.