ఒకే ధ్యేయంతో పనిచేస్తున్న జగన్, పవన్ ఎందుకు కలిసి పనిచేయకూడదని మిగిలిన ప్రతిపక్షాల్లోని ఒకరిద్దరు నేతలు జగన్, పవన్ సన్నిహితుల వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం.

ప్రత్యేక హోదా సాధనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ కలుస్తారా? కలిసే అవకాశాలున్నట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇద్దరి లక్ష్యమూ ఒకటే అయినపుడు ఇద్దరూ కలిసే ఎందుకు పోరాటం చేయకూడదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కలిసి ఉద్యమం చేస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుందని కూడా ఇరువైపుల వారికీ స్పష్టం చేసినట్లు సమాచారం. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అన్నది చాలా అవసరం. అటువంటిది ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపికి చేయిచ్చింది.

 ఎన్నికల సమయంలో పదే పదే హోదా విషయంలో ఎన్నో హామీలిచ్చిన కేంద్రమంత్రి వెంకయ్యనాయడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చారు. దాంతో హోదాపై వివాదం పెరిగిపోయి ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగాయి. అక్కడి నుండి వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి దశల వారీగా ఎన్నో ఆందోళనలను చేపడుతునే ఉన్నారు. ఎన్నికల సమయంలో సినీనటుడు పవన్ కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలతో కలిసి ఎన్నికల ప్రచారం చేయటం గమనార్హం. అయితే, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలు హోదాపై మాటమార్చటాన్ని పవన్ జీర్ణించుకోలేకపోయారు.

అప్పటికే జగన్ ఆందోళలతో ప్రజల మనోభావాలను గమనించిన పవన్ కూడా హోదా కోసం ఉద్యమించాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో తిరుపతిలో మృతిచెందిన తన అభిమాని కుటుంబాన్ని పరామర్శించటానికి వచ్చిన పవన్ ను అక్కడి అభిమానులు హోదా విషయమై ప్రశ్నించినట్లు సమాచారం. అసలే ఆవేశపరుడైన పవన్ వెంటనే తిరుపతిలోనే బహిరంగ సభ ఏర్పాటు చేసి కేంద్రాన్ని కడిగిపారేసారు. పనిలో పనిగా టిడిపి పార్లమెంట్ సభ్యులను కూడా ఏకేసారు.

తిరుపతి సభ ద్వరా జనాల్లో వచ్చిన స్పందనను గమనించిన పవన్ తరువాత కాకినాడలో కూడా రెండో సభ పెట్టారు. ఈ నెల 10వ తేదీన అనంతపురంలో మూడవ సభను నిర్వహిస్తున్నారు. అంటే, ప్రత్యేకహోదా సాధన విషయంలో విఫలమైనందుకు ఇటు టిడిపి అటు భాజపాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్న విషయాన్ని పవన్ గ్రహించారు. అందుకనే రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన కోసం ఎన్ని ఉద్యమాలైనా చేస్తానని శపథం చేసారు.

 అదే సమయంలో జగన్ కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకహోదా సాధనే ధ్యేయంగా సభలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా యువతను కలుస్తున్నారు. ఇటు జగన్ అయినా అటు పవన్ అయినా ప్రత్యేకంగా యువతనే లక్ష్యంగా చేసుకున్నారు. జగన్, పవన్కు తోడు కాంగ్రెస్, వామపక్షాలు కూడా హోదా సాధన కోసం ఏదో ఒక రూపంలో ఆందోళనలను చేస్తూనే ఉన్నాయి. పైగా హోదా సాధన కోసం ఉద్యమాలు చేయటంలో ఎవరితోనైనా కలుస్తామని అటు జగన్ ఇటు పవన్ ఎన్నోమార్లు ప్రకటించారు.

ఈ నేపధ్యంలోనే ఒకే ధ్యేయంతో పనిచేస్తున్న జగన్, పవన్ ఎందుకు కలిసి పనిచేయకూడదని మిగిలిన ప్రతిపక్షాల్లోని ఒకరిద్దరు నేతలు జగన్, పవన్ సన్నిహితుల వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం. ఇద్దరిదీ ఒకటే ధ్యేయం అయినపుడు పైగా ఇరువురూ జనాకర్షక నేతలే కాకుండా ఇద్దరి మధ్యా ఎటువంటి మనస్పర్ధలు లేవు కాబట్టి కలిసి ఉద్యమిస్తే మరింత ప్రభావవంతంగా ఉంటుందని సదరు నేతలు చెప్పినట్లు తెలిసింది. అయితే, ఇరువైపుల నుండి ఎటువంటి స్పందన వచ్చిందన్న విషయమై సరైన సమాచారం లేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎటువంటి పాత్ర పోషించాలనే విషయమై పవన్ కే ఇంకా స్పష్టత రాలేదని సన్నిహితులు చెబుతున్నారు. ఆ స్పష్టత వచ్చేస్తే ఇద్దరు అగ్రనేతలూ కలిసి ఉద్యమాలు చేయటానికి ఎక్కువ అవకాశాలున్నట్లు పలువరు భావిస్తున్నారు.