చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ రాజకీయాలు చేస్తున్నట్లు స్వయంగా కాపు సామాజిక వర్గంలోనే చర్చ మొదలైంది.
ప్రత్కేకహోదా ఉద్యమం పుణ్యమా అని ముసుగు విడిపోయింది. ఇంతకాలమూ జనాల మదిలో ఎక్కడో ఉన్నఅనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. తెలుగుదేశంపార్టీ-జనసేన ఒకటే అన్న సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేకహోదా ఉద్యమం పేరుతో గురువారం రాష్ట్రం మొత్తం ఆందళనలతో అట్టుడుకిపోయింది. అయితే అంతకుముందు జల్లికట్టు పేరుతో ట్విట్టర్లో యువతను రెచ్చగొట్టిన పవన్ కల్యాణ్ మాత్రం ఎక్కడా అడ్రస్ లేరు.
ఉత్తరాధి రాష్ట్రాల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, జల్లికట్టు స్పూర్తిని రగిలిస్తూ, ప్రత్యేకహో దా అవసరాన్ని నొక్కిచెబుతూ పవన్ కల్యాణ్ వరుస ట్విట్టర్లతో మోతెక్కించారు. దాంతో యువతలో ఆవేశం కట్టలు తెంచుకున్నది. దానికి తోడు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు మద్దతుగా రాసిన బహిరంగ లేఖ, తరువాత మద్దతు ప్రకటించిన వైసీపీ, వామపక్షాలతో ఉద్యమ స్పూర్తికి మరింత ఊపొచ్చింది.
అయితే, జరుగుతున్న పరిణామాలతో చంద్రబాబునాయుడు ఉలిక్కిపడ్డారు. దానికితోడు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాను విశాఖకు వస్తానని ప్రకటించగానే చంద్రబాబులో ఆందోళన మరింత పెరిగిపోయింది. ఉద్యమాన్ని అణిచివేయటానికి ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసారు. దాంతో మునుపెన్నడూ లేనివిధంగా పోలీసుల ఓరవ్ యాక్షన్ స్పష్టంగా కనబడింది. ఈ నేపధ్యంలో నిజంగానే పవన్ గనుక విశాఖపట్నంలో అడుగుపెట్టివుంటే సీన్ వేరే విధంగా ఉండేది. కానీ ఎక్కడా కనబడలేదు. ఉదయానికే పవన్ రాకపై అనుమానాలు మొదలయ్యాయి. చివరకు అదే నిజమై గురువారం మొత్తం పవన్ ఎక్కడా కనబడలేదు.
ప్రత్యేకహోదా ఉద్యమంలో పాల్గొని హీరో అనిపించుకోవాల్సిన పవన్ మాత్రం చివరకు జీరోగా మిగిలిపోయారు. దాంతో అధికారపార్టీ రాజకీయంపై సర్వత్రా అనుమానాలు మొదలయ్యాయి. టిడిపిలోని ‘ముఖ్యు’ల ఆదేశాలమేరకే పవన్ నడుచుకున్నారన్న ప్రచారం ఊపందుకున్నది. దానికితోడు టిడిపి నేతలు కూడా రోజు మొత్తం జగన్నే లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేసారేగానీ పవన్ను పల్లెతు మాట అనక పోవటం గమనార్హం.
జరిగిన పరిణామాలు చూసిన తర్వాత తెరవెనుక పవన్ కల్యాణ్-చంద్రబాబునాయడు ఒకటే అన్నప్రచారానికి ఊతమొచ్చింది. చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ రాజకీయాలు చేస్తున్నట్లు స్వయంగా కాపు సామాజిక వర్గంలోనే చర్చ మొదలైంది. దాంతో జనసేనకు మద్దతు పలికే విషయంలో జనాలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్ధితిని స్వయంగా పవన్ కల్యాణే కల్పించుకున్నారు. జనవరి 26 ఉద్యమం ఆధారంగానే రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశాలు మాత్రం స్పష్టం.
