వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఫోన్?.. తారకరత్న ఆరోగ్యంపై చర్చ..!
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. బాలకృష్ణ అన్న మోహనకృష్ణ కుమారుడు, సినీ నటుడు నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తారకరత్నకు ఆరోగ్య పరిస్థితితిని బాలకృష్ణ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి విజయసాయిరెడ్డి బంధువు అవుతారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి.. బుధవారం నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వెళ్లి తారకరత్నను పరామర్శించారు. తారకరత్నకు అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా విజయసాయిరెడ్డికి బాలకృష్ణ ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇరువురు కూడా తారకరత్నకు అందుతున్న చికిత్స గురించి చర్చించినట్టుగా పలు మీడియా సంస్థలు రిపోర్టు చేశాయి.
ఇక, బుధవారం నారాయణ హృదయాలయ ఆస్పత్రి వెలుపల మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. గుండెపోటు వచ్చిన సమయంలో 40 నిమిషాలు మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడంతో.. మెదడులో పైభాగం కొంత దెబ్బతిన్నప్పటికీ కూడా రికవరీ అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని అన్నారు. గుండెకు సంబంధించి అన్నిరకాలుగా చాలా పర్‌ఫెక్ట్ ఫంక్షనింగ్ జరుగుతుందని చెప్పారు. వైద్యులు అద్భుతమైన ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. సౌకర్యాలను, అన్ని విషయాలను నందమూరి బాలకృష్ణ స్వయంగా చూసుకుంటున్నారని.. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పారు.