విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్రం కావాలని ఎవరిపైనా కక్ష సాధించదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పాలన గాడి తప్పిందని ఆయన చంద్రబాబు పాలనపై విమర్శలు చేశారు. 

విజయవాడ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో సుజనా చౌదరి మాట్లాడారు.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగంలేదని ఆయన అన్నారు. టీడీపీ నుంచి బీజేపిలోకి ఎవరు వస్తారో తెలియదని ఆయన అన్నారు. 

జగన్, చంద్రబాబు ప్రధానిగా ఉన్నా కూడా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వలేరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం పట్టుదలకి పోకుండా ప్యాకేజ్‌ని సాధించుకోవాలని సూచించారు. పార్టీ ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. 

అప్పటి వరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ఎన్టీఆర్‌ పోటోతో పాటు తన ఫోటో ఉన్న ఫ్లెక్సీని చూసి సంతోషపడ్డానని అన్నారు. ఎన్టీఆర్‌ అభిమాని ఎవరో మంచి ఆలోచనతోనే ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.