అమరావతి: ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుదిబండనే కానుంది. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని బిజెపి నేతలు స్పష్టంగా చెబుతున్నారు. అంతేకాదు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికీ ఇచ్చేది లేదని మరింత స్పష్టంగా చెప్పారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడమనేది కలలో మాట మాత్రమేనని తేలిపోయింది.

ప్రత్యేక హోదాకు తాను కట్టుబడి ఉన్నానని, దాన్ని సాధించేందుకు ప్రయత్నం చేస్తానని జగన్ అంటున్నారు. నిజానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ప్రత్యేక హోదా రాదనే విషయం స్ప,ష్టంగానే అర్థమైంది. అయినప్పటికీ కేంద్రంతో సఖ్యతతో ఉంటూనే ప్రత్యేక హోదా సాధించడానికి ప్రయత్నం చేస్తానని ఆయన చెబుతున్నారు. 

బిజెపితో ప్రస్తుతానికైతే జగన్ కయ్యానికి దిగే పరిస్థితి లేదు. పోలవరం ప్రాజెక్టుకు, తదితర పథకాలకు కేంద్ర సాయం ఎపికి అత్యవసరం. ఆ సహాయాన్ని పొందడానికే జగన్ తీవ్రంగా కృషి చేయాల్సి రావచ్చు. తెలుగుదేశం పార్టీ నాయకులను చేర్చుకోవడం ద్వారా వైసిపి ప్రత్యామ్నాయం కావాలని భావిస్తున్న బిజెపి ఇప్పటికిప్పుడు జగన్ తో స్నేహపూర్వకంగానే ఉండవచ్చు. కానీ, నిధుల విషయంలో ఏ మేరకు చేయూత అందిస్తుందనేదే ప్రశ్నార్థకం. 

తెలుగుదేశం పార్టీ నేతలను తన వైపు తిప్పుకుని ఆ పార్టీని రూపుమాపిన తర్వాత కచ్చితంగా బిజెపి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యం చేసుకునేందుకు వ్యూహాలు రచించి అమలు చేయబోతుందని కచ్చితంగానే అర్థమవుతోంది. గతంలో చంద్రబాబును ఒంటరి చేయడానికి ప్రయత్నించినట్లుగానే జగన్ నూ ఒంటరి చేయడానికి బిజెపి ప్రయత్నిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. 

ఎన్నికలకు రెండు మూడేళ్ల ముందు కచ్చితంగా బిజెపి జగన్ ను, ఆయన పార్టీ వైసిపిని లక్ష్యం చేసుకుని రాజకీయాలు నడుపుతుంది. జగన్ ను బలహీనపరుస్తూ ఎపిలో బలం పుంజుకోవడానికి అంది వచ్చే ఏ అవకాశాన్ని కూడా బిజెపి వదులుకోదు. ప్రత్యేక హోదా సాధించలేదనే అపవాదును కూడా జగన్ మోయాల్సి వస్తుంది. 

ప్రత్యేక హోదాను సెంటిమెంటుగా మార్చి జగన్ ఎన్నికల్లో విజయం సాధించారు. వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యేకహోదా సాధించలేకపోయినందుకు ప్రజల నుంచి వ్యతిరేకతను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. దాన్ని ఆయన ఎలా అధిగమిస్తారనేది ఆయన రాజకీయ చతురత మీద ఆధారపడి ఉంటుంది.