వైసిపి ఎంపీలకు స్పీకర్ పిలుపు: రాజీనామాల ఆమోదానికే?

Speaker calls resigned YCP MPs
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ రాజీనామాలు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు  లోక్‌ సభ స్పీకర్‌ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ రాజీనామాలు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు  లోక్‌ సభ స్పీకర్‌ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 29వ తేదీన లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలుస్తామని వైసిపి ఎంపి మిథున్ రెడ్డి చెప్పారు.

రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్‌ వైఎస్సార్‌ సీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తారని అన్నారు. రాజీనామా చేసిన ఎంపీలు అందరూ తిరిగి ప్రజల్లోకి వెళ్లి చిత్తశుద్ధిని నిరూపించుకుంటారని అన్నారు. ఉప ఎన్నికలు వస్తే గెలిచి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే.  

పార్లమెంట్‌ నివరధిక వాయిదా పడిన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డిలు స్పీకర్‌ను కలుసుకుని, రాజీనామా లేఖలను సమర్పించారు. 

రాజీనామాలను ఆమోదించాలని స్పష్టంగా చెబుతామని వైసిపి ఎంపి వరప్రసాద్ అన్నారు. స్పీకర్ రాజీనామాలు ఆమోదిస్తారనే నమ్మకం ఉన్నట్లు తెలిపారు.
 

loader