సారాంశం

ఈ నెల 13న నైరుతి రుతుపవనాలు అండమాన్‌లోకి రానున్నాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటు పిడుగులు, వానలు సంభవించే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.

ఈ నెల 13వ తేదీన నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ మరియు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా ఈ రుతుపవనాలు మే 20 తర్వాతే అక్కడికి చేరుతుంటాయి. అయితే ఈసారి వాతావరణ పరిస్థితులు ముందుగానే అనుకూలంగా ఉండటంతో వారం ముందే మోన్సూన్ ఆ ప్రాంతాన్ని తాకనున్నట్లు సమాచారం.ఇక రాష్ట్రంలో వాతావరణం వేడెక్కుతోంది. మంగళవారం రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వానలు పడగా, తిరుపతి జిల్లా వినాయకపురంలో 40.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఎండలు మరింతగా పెరిగాయి.

మోస్తరు నుంచి భారీ వర్షాలు..

చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 42.4 డిగ్రీలు, తిరుపతి జిల్లా రేణిగుంట, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 42.1 డిగ్రీలు, కడప జిల్లా ఒంటిమిట్లలో 41.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా కామవరంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.విపత్తు నిర్వహణ సంస్థ తాజా హెచ్చరికల ప్రకారం, బుధవారం కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రంలోని కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం కూడా ఉందని వెల్లడించింది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, గంగవరం మండలాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులు, తేలికపాటి వర్షాలు, ఈదురుగాలులు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.