అమరావతి: తెలుగు ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వర్షా కాలం మొదలయ్యింది. ఇప్పటికే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశించాయి. ఇవి రాష్ట్రంలో మరింత వేగంగా విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చిత్తూరు జిల్లా నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈనెల 31న కేరళ తీరాన్ని తాకిన పవనాలు ఈసారి చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు నుండి ఏపీలో విస్తరించాయి. మామూలుగా నైరుతి రుతుపవనాలు అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో ఏదో ఒకచోట నుంచి ప్రవేశిస్తాయి.

మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా ముందుకు సాగుతూ విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉంది. ఈసారి సాధారణ స్థాయిలోనే వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

read more  చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు... తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు

మండుటెండల వల్ల విసిగిపోయిన తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ ఇలా చల్లటి కబురు అందించింది. ఇవాళ నైరుతి రుతుపవనాలు ఏపీని తాకడంతో వాతావరణం మరింత చల్లబడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా వీటి ప్రభావంతో అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం వున్నట్లు తెలిపారు. 

 జూన్ 1 న ఈ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు ఐఎండీ ప్రకటించగా మూడు రోజుల ముందుగానే ఇవి కేరళను చేరాయి.  అండమాన్‌ నికోబార్‌ దీవులను పూర్తిగా ఆవరించిన ఈ రుతు పవనాలు వేగంగా ముందుకు కదిలాయి. ఇలా  వాతావరణం  ఈ రుతుపవనాలకు సహకరించడంతో మూడు రోజుల ముందే కేరళ తీరాన్ని తాకినట్లు అధికారులు తెలిపారు. 

నైరుతి రాకతో దేశంలో ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.  ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇదే అనుకూల వాతావరణం కొనసాగితే సకాంలోనే రుతుపనాలు దేశవ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.