కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ఇండియా త్వరలో శ్రీలంకలా మారే పరిస్థితులు తలెత్తుతాయని కేఏ పాల్ జోస్యం చెప్పారు. బుధవానం జంతర్ మంతర్ లో ధర్నా చేస్తున్నట్టు ప్రకటించారు. 

ఢిల్లీ : కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న అప్పులతో భారతదేశం త్వరలోనే శ్రీలంక, వెనిజువెలాలా మారనుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA Paul అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పునర్ విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా.. కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్న తీరుకు నిరసనగా జంతర్మంతర్ లో బుధవారం ధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తాను చేస్తున్న ధర్నాకు కెసిఆర్, జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వాలని కోరారు. క్లౌడ్ బరస్ట్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం అన్నారు. 

ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పదేళ్లలో 9 పార్టీలతో జత కట్టారని, ఆయన రాజకీయాలకు పనికిరాడు అని విమర్శించారు. పవన్ ను ఎవరూ నమ్మడం లేదని, జేడీ లక్ష్మీనారాయణ వంటి నాయకులు అందుకే పార్టీని విడిచి వెళ్లాలని అన్నారు. తాను హైదరాబాద్లో గ్లోబల్ సమ్మిట్ పెడతానంటే గుజరాత్ లో పెట్టాలని బీజేపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారని ఆయన తెలిపారు. ఆగస్టు 15 వరకు పునర్ విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పుకొచ్చారు.

విభజన హామీల అమలే లక్ష్యం: ఢిల్లీలో మౌనదీక్షకు దిగిన కేఏ పాల్, దిగిరాకుంటే ఆమరణ దీక్షే

ఇదిలా ఉండగా, జూలై 15న తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీకి 60 శాతం ప్రజల మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడుకెఏ పాల్ అన్నారు. ఢిల్లీలో జూలై 14న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు వంటి ఏ ఒక్క హామీని కెసిఆర్ నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడివి కుటుంబ పార్టీలని, వారు ఇకనైనా తమ తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించవద్దని, బ్యాలెట్ పత్రాలు వినియోగించాలని అన్నారు. ఈ అంశం మీద 18 ప్రధాన పార్టీల నేతలతో కలిసి చర్చించినట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని విమర్శించారు. 

ఇదిలా ఉండగా, మే 13న తనపై కేసీఆర్, కేటీఆర్ లు దాడి చేయించారని ఆ దాడి పరిణామాలను వారు త్వరలోనే చూస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మే 12 రాత్రి ఆయన కలిశారు. తర్వాత పాల్ మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమాలను తన జీవితంలో ఏనాడు చూడలేదన్నారు. అమిత్ షాతో తాను అనేక విషయాలు చర్చించినట్లు తెలిపారు. కెసిఆర్, కేటీఆర్ల అవినీతితో రాష్ట్రంలో లక్షల కోట్లు మాయమయ్యాయని ఆరోపించారు.