Asianet News TeluguAsianet News Telugu

ఓటమి ఎరుగని జెసి కుటుంబ సభ్యులకు చుక్కలు: జగన్ వైపు వారసులు

ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోదామని జేసీ వారసులు ప్రయత్నించారు. అక్కడ కూడా జేసీ దివాకర్ రెడ్డి అడ్డుపడ్డారని కుమారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్ కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే మేలని వారసులు భావిస్తున్నారట.  

Sons of JC brothers may try to join in YSRCP
Author
Ananthapuram, First Published Jun 5, 2019, 3:37 PM IST

అనంతపురం: అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఆ కుటుంబానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. దశాబ్ధకాలంగా రాజకీయాలు చేస్తూ తమకు ఎదురేలేదని నిరూపించుకున్నారు. పార్టీలు మారినా ప్రజలు వారికే పట్టం కట్టారు. 

కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన ఆ ఫ్యామిలీ రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరిపోయింది. టీడీపీలో చేరినప్పటికీ అనంతపురం ప్రజలు ఆ కుటుంబానికే పట్టంకట్టారు. 2014 ఎన్నికల్లో ఆదరించిన ఓటర్లు 2019 ఎన్నికలకు వచ్చేసరికి చుక్కలు చూపించారు. 

ఘోరంగా ఆ కుటుంబాన్ని ఓడించారు. ఇంతకీ ఆ ఫ్యామిలీ ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుందని అనుకుంటా ఇంకెవరు వివాదాస్పద నేత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఎన్నో పదవులు అధిరోహించారు జేసీ దివాకర్ రెడ్డి. 

ఇకపోతే 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరింది జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ. 2014 ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. 

రాజకీయాల్లో ఎంతటి పేరు సంపాదించారో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అంతలా వార్తల్లో హల్ చేస్తుంటారు. తెలుగుదేశం పార్టీలో చేరడం ఎంపీగా, సోదరుడు ఎమ్మెల్యేగా గెలవడం జరిగిపోయిన తర్వాత జిల్లాలో ఆధిపత్యం చెలాయిద్దామని చూసి అనేక సార్లు బొక్క బోర్లాపడ్డారు.  

తన వారసుల రాజకీయ ప్రవేశం కోసం సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే తీవ్ర ఆరోపణలు చేశారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదులు సైతం చేశారు. ఒకానొక దశలో చంద్రబాబుతో చీవాట్లు కూడా తిన్న దాఖలాలు లేకపోలేదు. 

అంతేకాదు రాష్ట్రంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని లేకపోతే పార్టీ ఓడిపోతుందని చెప్పి మరోసారి సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇకపోతే ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. 

ఇకపోతే 2019 ఎన్నికల్లో అనంతపురం ఎంపీ అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డిని బదిలోకి దించగా, తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిని బరిలోకి దింపారు. 

ఈ ఎన్నికల్లో జేసీ వారసులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతుల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. కనీవినీ ఎరుగని రీతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. జేసీ ఫ్యామిలీ రాజకీయాల్లో ఒక్కసారి మాత్రమే జేసీ దివాకర్ రెడ్డి ఓడిపోయారు. ఆనాటి నుంచి నేటి వరకు ఓటమి ఎరుగని ఫ్యామిలీగా రాజకీయం చేస్తున్నారు.  

అలాంటి ఫ్యామిలీకి అనంతపురం ప్రజలు చుక్కలు చూపించడంతో జేసీ బ్రదర్స్ కు భవిష్యత్ పై ఆలోచన పడింది. తాము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని ప్రకటిస్తూనే తమ వారసుల భవిష్యత్ పై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. 

అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ను ఒక ఆట ఆడుకున్నారు జేసీ బ్రదర్స్. చంద్రబాబు నాయుడు కూడా విమర్శించని రీతిలో జగన్ పై విరుచుకుపడ్డారు. తీరా ఎన్నికలు పూర్తయ్యాక, జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి టోన్ మార్చారు. 

జగన్ మావాడే అంటూ భుజాన వేసుకుంటున్నారు. తమకు ఒక బంధం కూడా ఉందంటూ బీరకాయపీచు సంబంధం అల్లుతున్నారు. అదంతా ప్లాన్ ప్రకారమే జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతున్నారని జగన్ కు దగ్గరయ్యే ప్రయత్నంలో అదొక భాగమంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి మెుదటి నుంచి మెుగ్గు చూపుతున్నారు. వైయస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్ తో కలిసి కొంతకాలం పనిచేశారు జేసీ పవన్ కుమార్ రెడ్డి. 

అయితే తండ్రి నిర్ణయంతో టీడీపీలో చేరాల్సి వచ్చింది. 2014 ఎన్నికలకు ముందు సైతం జేసీ పవన్ కుమార్ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరదామని తండ్రికి సూచించారట. అయితే తమ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని చెప్పుకొచ్చారట. ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోదామని జేసీ వారసులు ప్రయత్నించారు. 

అక్కడ కూడా జేసీ దివాకర్ రెడ్డి అడ్డుపడ్డారని కుమారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్ కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే మేలని వారసులు భావిస్తున్నారట. అయితే సీఎం జగన్ జేసీ వారసుల రాకను ఆహ్వానిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. 

ఇకపోతే జేసీ వారసులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కేతిరెడ్డి బ్రదర్స్ వారి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తారని జిల్లాలో ప్రచారం జరుగుతుంది. ఇకపోతే హిందూపురం ఎంపీగా గెలుపొందిన మాధవ్ సైతం అడ్డుకునే ఛాన్స్ ఉందని ప్రచారం  జరుగుతుంది. మరి జేసీ వారసుల రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందో అన్నది కాలమే సమాధానం చెప్పాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios