ప్రపంచంలో అన్ని బంధాల్లో కెల్లా తల్లీ, బిడ్డ బంధం గొప్పదని అందరూ అంటుంటారు. తల్లి తన బిడ్డపై ఎనలేని ప్రేమ చూపిస్తుంది. తాను తినకున్నా.. బిడ్డ కడుపు నింపాలని భావిస్తుంది. అలాంటి తల్లి పట్ల కొడుకు చాలా కిరాతకంగా వ్యవహరించాడు. కదల్లేని స్థితిలో ఉన్న తల్లి పీక కోసేసి హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం తోటపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం తోటపల్లి గ్రామంలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొప్పిరెడ్డి ముత్తమ్మ(80), ఆమె భర్త ముక్కయ్య, రెండో కుమారుడు నాగులు ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. గత ఏడాది నుంచి వృద్ధురాలికి కళ్లుసరిగా కనబడకపోవడంతో పాటు నడవలేని స్థితికి చేరుకుంది. సొంత పనులు కూడా చేసుకోలేని పరిస్థితి రావడంతో భర్త ముక్కయ్యే ఆమెకు సేవలు చేసేవాడు.

Also Read రాజకీయాల నుండి తప్పుకొంటా, ఇలా చేస్తారా: జగన్ కు బాబు సవాల్
 
సోమవారం తండ్రి కట్టెల కోసం బయటికి వెళ్లగా, మంచంపై నిద్రిస్తున్న తల్లిని లేపి పీకకోసి చంపేశాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న డీఎస్పీ ఖాదర్‌బాషా, సీఐ హానీష్‌ ఘటనా స్థలికి చేరుకున్నారు. నాగులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తల్లిని చూసేవారు ఎవరూ లేనందున తానే ఆమెను చంపినట్లు అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. కాగా, తల్లిదండ్రుల పింఛన్‌ సొమ్ము కోసం కొడుకు నాగులు వారిని హింసించేవాడని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. తరచూ మద్యం తాగి వచ్చి కొడుతూ ఉండేవాడని తెలిపారు.