తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరగింది. కన్నతండ్రిని కొడుకే అత్యంత కిరాతకంగా హత్య చేసి ఇంటి పక్కనే పూడ్చిపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ రూరల్ మండటం రమణయ్య పేట గ్రామపంచాయతీ పరిధిలోని బర్మా కాలనీకి చెందిన గోపిరెడ్డి ఈశ్వరరావు మద్యానికి బానిసై తరచుగా భార్యను వేధించడంతో పాటు చేయి చేసుకునేవాడు.

తల్లి బాధను చూడలేకపోయిన కొడుకు కుమార్ తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. ఓ రోజున తల్లితో కలిసి తండ్రిని చంపి మృతదేహాన్ని గుట్టుచప్పుడు ఇంటి పక్కనే పూడ్చి పెట్టాడు. అయితే రెండు నెలల తర్వాత ఫుల్లుగా తాగిన కుమార్ .. తన తండ్రిని తానే చంపానని చిన్నాన్నతో చెప్పడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.

ఈ విషయం ఆనోటా ఈ నోటా గ్రామంలో తెలియడంతో కుమార్ మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఈశ్వరరావుకి నలుగురు అమ్మాయిలు కావడంతో అతను కుమార్‌ను దత్తత తీసుకుని పెంచుకున్నాడు.