దేశంలో చాలా చోట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను కొత్త వారిని నియమించారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణను కావాలనే తప్పించి..సోము వీర్రాజుకి పదవి కట్టపెట్టారంటూ రెండు రోజులు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. దీనిపై సోము వీర్రాజు స్పందించారు.

కన్నా లక్ష్మీనారాయణను తప్పించి తనను నియమించారన్న ప్రచారం వాస్తవం కాదన్నారు. బీజేపీలో వ్యక్తి ముఖ్యం కాదని.. ఏపీలో బీజేపీ, జనసేన మైత్రిని మరింత పటిష్టం చేస్తామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అవినీతిని నిలదీస్తామన్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాలు అక్రమాలపై పోరాటం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ భూములు విక్రయించటాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని సహించబోమన్నారు.

ఇదిలా ఉండగా... నిన్నటికి నిన్న కన్నా లక్ష్మీనారాయణను తొలగించి.. సోము వీర్రాజుకి అధ్యక్షపదవిని కట్టపెట్టిన సంగతి తెలిసిందే. అయితే..కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలే కన్నా స్థానంలో సోము వీర్రాజు నియామకానికి కారణమని ప్రచారం జరుగుతోంది.

 తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కాగా, గత కొంతకాలంగా ఏపీ సర్కారుపై కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా, ఈయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారంటూ వైకాపా నేతలు పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు.

అంతేకాకుండా, ఏపీ రాజధాని అమరావతి విషయంలోనూ కన్నా లక్ష్మీనారాయణ సొంత అజెండాతో ముందుకు సాగుతున్నారంటూ వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నాను తొలగించి, ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజును బీజేపీ అధిష్టానం నియమించింది.