అమరావతి: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరికి ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు షాక్ ఇచ్చారు. బిజెపి అధ్యక్షుడిగా ఇటీవలే నియమితులైన ఆయన తాను ఎలా ఉండబోతున్నాననే విషయాన్ని సుజనా చౌదరికి షాక్ ఇవ్వడం ద్వారా స్పష్టం చేశారు. సుజనా చౌదరి నోటికి తాళం పడే అవకాశాలు దీంతో ఉన్నాయని భావిస్తున్నారు.

అమరావతి విషయంలో సుజనా చౌదరి ప్రకటనలు ఇక ముందు సాగే అవకాశం ఉండదని ఆయన చెప్పకనే చెప్పారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే విషయంలో కేంద్రం జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని సుజనా చౌదరి గురువారం చెప్పారు. దాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్ బిజెపి ఖండించింది. రాష్ట్ర బిజెపి వైఖరిని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. 

అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన సమయంలో జోక్యం చేసుకుంటుందని సుజనా చౌదరి గురువారం అన్నారు. రాజధాని విషయంలో సోము వీర్రాజు ప్రకటన చేసిన కొద్దిసేపటికే సుజనా చౌదరి ఆ విషయంపై మాట్లాడారు. కన్నా లక్ష్మినారాయణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా సుజనా చౌదరి అదే విధంగా మాట్లాడుతూ వచ్చారు. కానీ ఆయనకు వ్యతిరేకత ఎదురు కాలేదు. 

మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదనను సుజనా చౌదరి తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేంద్రం బూచిని చూపిస్తూ వస్తున్నారు. అయితే, సుజనా చౌదరి మాటలకు చెల్లుబాటు లేదని ఒక్క మాటతో బిజెపి స్ఫష్టం చేసింది. 

Also Read: అమరావతిపై కేంద్రం జోక్యం: సుజనా ఒకటి.. సోము మరొకటి, అయోమయంలో బీజేపీ శ్రేణులు

రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అన్న బిజెపి ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్య పార్టీకి విరుద్ధమని బిజెపి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రబుత్వం పరిధిలో లేదన్నదే బిజెపి విధానంగా అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారని వివరించింది.

వైఎస్ జగన్ ప్రభుత్వంపై పోరాటంలో సుజనా చౌదరి వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలకు సోము వీర్రాజు కళ్లెం వేయడానికి సిద్ధపడినట్లు తాజా పరిణామం తెలియజేస్తోంది. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. బిజెపిలో ఉంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు సుజనా చౌదరి అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గతంలో విమర్శించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర బిజెపి వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

తాజా పరిణామంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఊరట లభించినట్లే. సుజనా చౌదరితో పాటు కొంత మంది బిజెపి నాయకులు మూడు రాజధానుల విషయంలో తనకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలు ఆగిపోతాయని ఆయన భావించడానికి వీలుంది.