మిల్లర చేతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. మిల్లర్లు, దళారులు, ఎమ్మెల్యేలు, అధికారులు ధాన్యం స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు.
మిల్లర చేతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలుబొమ్మగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. మిల్లర్లు, దళారులు, ఎమ్మెల్యేలు, అధికారులు ధాన్యం స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నెల్లూరు నగరంలో బీజేపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. అయితే బీజేపీ నేతలను కలెక్టరేట్‌లోని రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో బీజేపీ నేతలు ముఖ్యమంత్రికి, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు పండించే ధాన్యం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నుంచి రైతుల తరఫున ఉద్యమ సమరశంఖం పూరించామని చెప్పారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నా కనికరం లేదని మండిపడ్డారు. రైతుల కష్టాన్ని అధికారులు, మధ్య దళారులు దోచుకుంటున్నారని విమర్శించారు. ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా జగన్ ప్రభుత్వం మిల్లర్లకు దాసోహమైందని ఆరోపించారు.
మరోవైపు నెల్లూరు ధర్మోపవర్ ఉత్పత్తి కేంద్రం వద్ద కార్మికుల ఆందోళనలకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మద్దతు తెలిపారు. బీజేపీ నేతలతో కలిసి ధర్నాకు దిగారు. ధర్మోపవర్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారో స్పష్టం చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఒకవేళ దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు ఇలాగే కొనసాగిస్తే కార్మికుల తరఫున బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ప్రజలు ప్రభుత్వానికి మనుషులు లాగ కనపించడం లేదా అని ప్రశ్నించారు. పరిశ్రమ నష్టాలకు బాధ్యులు ఎవరని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
