ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు.
విశాఖపట్నం: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఈ భేటీ తర్వాత అనేక పుకార్లు వెలుగులోకి వచ్చాయి. 2014 ఎన్నికల్లో ఎన్డీయేతో కలిసి సాగిన చంద్రబాబు.. 2019 ఎన్నికలకు కొంతకాలం ముందే బీజేపీకి వీడ్కోలు పలికారు. ఆ తర్వాత బీజేపీ వ్యతిరేక కూటమికి ప్రయత్నించి విఫలమయ్యారు. బీజేపీకి వీడ్కోలు పలికిన దాదాపు ఐదేళ్ల తర్వాత బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు సమావేశం కావడంతో.. ఇరు పార్టీల మధ్య రాజకీయ పొత్తుకు తొలి అడుగు అనే చర్చ సాగుతుంది.
ఈ ప్రచారం నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ రైల్వే గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ మహాజన సంపర్క్ అభియాన్ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా.. రానున్న ఎన్నికలకు సంబంధించిన పొత్తులపై ఏదైనా ప్రకటన చేస్తారా? లేదా? అనే చర్చ కూడా సాగుతుంది.
అయితే అమిత్ షా విశాఖ పర్యటన నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల సాధించిన ప్రగతిపై అమిత్ షా మాట్లాడతారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతో సాయం చేస్తుందని అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం విశాఖ నగరాన్ని అభివృద్ది చేసిందని అన్నారు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ది చెందడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను మొదటి నుంచి బీజేపీ ప్రశ్నిస్తూనే ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉన్నామని అన్నారు.
అమిత్ షా సభను కమ్యూనిస్టులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. అమిత్ షా సభలో పొత్తులపై ఎలాంటి ప్రకటన ఉండదని అనుకుంటున్నాననని అన్నారు.
