మళ్ళీ రెచ్చిపోయిన వీర్రాజు

Somu veerraju came down heavily on Naidus government again
Highlights

  • టీడీపీ చేయాల్సింది ట్రేడింగ్ కాదని రూలింగ్ అంటూ సోము వీర్రాజు మరోసారి రెచ్చిపోయారు.

టీడీపీ చేయాల్సింది ట్రేడింగ్ కాదని రూలింగ్ అంటూ సోము వీర్రాజు మరోసారి రెచ్చిపోయారు. చంద్రబాబునాయుడు పేరెత్తకుండానే ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ పనితీరుపై  విమర్శనాస్త్రాలు సంధించారు.

సోముపై టిడిపి నేతలు ఎంతమంది మాటలతో దాడులు చేస్తున్నా ఏమాత్రం తగ్గటం లేదు. మంగళవారం చంద్రబాబునాయుడుపై సంచలన ఆరోపణలు చేసిన వీర్రాజు బుధవారం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంలో మీడియాతో మాట్లాడుతూ, ఇసుక, ఎన్ఆర్జీఎస్, ఎర్ర చందనం, గ్రానైట్ నిధులు ఎక్కడికి పోతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసారు.

కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపునకు టీడీపీ వక్రభాష్యం చెబుతోందన్నారు. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ, బీజేపీకి కేటాయించిన సీట్లలో కూడా  పోటీ చేసిందని ఆరోపించారు. తమకు కేటాయించిన స్ధానాల్లో టిడిపి స్వతంత్ర అభ్యర్ధులకు మద్దతుగా పనిచేసింది వాస్తవం కాదా అంటూ మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు ప్రభుత్వం కనీస గౌరవం కూడా ఇవ్వటంలేదని ఆరోపించారు.

రాష్ట్రంలో తమ పార్టీ బలోపేతం అవుతుంటే టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని వీర్రాజు మంగళవారం వ్యాఖ్యానించిన సంగతి అందరికీ తెలిసిందే. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా తమ పార్టీ మోసపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

loader