అమరావతి: మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై నిన్న జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ చెప్పగా, నేడు ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడారు. రాజకీయంగా జనసేన, బిజెపి కూటమిని బలపరుస్తానని చిరంజీవి చెప్పినట్లు సోము వీర్రాజు చెప్పారు. చిరంజీవితో తాము కలిసి పనిచేస్తామని చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం తమదేనని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ, టీడీపీల్లో తమకు ఎవరు మద్దతు ఇస్తారో చూస్తామని ఆయన అన్నారు. గతంలో చిరంజీవిని సోము వీర్రాజు కలిశారు. 

తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెంట మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ బుధవారనాడు చెప్పిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ కు రాజకీయాల్లో మద్దతు ఇస్తానని చిరంజీవి చెప్పనట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాలు చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేసేలా ఒప్పించింది చిరంజీవేనని ఆయన అన్నారు. కొద్ది కాలం సినిమాలు చేయాలని పవన్ కు చిరంజీవి సూచించారని ఆయన అన్నారు. పవన్ రాజకీయ ప్రస్థానంలో తానూ ఉంటానని అంతర్గత భేటీలో చిరంజీవి చెప్పారని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తల భేటీలో ఆయన ఆ విషయాలు చెప్పారు.