టీటీడీకి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాలా లేక శ్రీనివాస రాజా? ఎవరి పరిపాలన నడుస్తోందని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు.

రాజమండ్రి: టీటీడీకి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాలా లేక శ్రీనివాస రాజా? ఎవరి పరిపాలన నడుస్తోందని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. శ్రీనివాస రాజుకు బదిలీ ఉండదా అని అడిగారు. ఐఎఎస్ అధికారి అయిన శ్రీనివాసరాజు ఎవరి సహకారంతో తొమ్మిదేళ్లుగా అదే పదవిలో కొనసాగుతున్నారని అడిగారు. 

 భక్తుల కోసం నిర్దేశించిన సేవలను ఎవరికి అమ్ముకుంటూ ధర్మానికి సంబంధించిన ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ఆ సొమ్మంతా ఎవరి చేతుల్లోకి చేరుతోందో ప్రజలకు తెలియాలని అన్నారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆలయ మర్యాదలు గాడితప్పడాన్ని రమణదీక్షితులు బహిరంగంగా ప్రశ్నించారని ఆయన గుర్తు చేశారు.

రమణదీక్షితులు అమిత్ షాను కలవడాన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా అడిగారు. వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చేస్తోన్న కుయుక్తులకు ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని, పరిపాలనను గాలికొదిలేసి కర్ణాటక రాజకీయాలతో, దేశ రాజకీయాలతో కాలం గడుపుతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు ప్రభావం ఉంటే కర్ణాటకలో బీజేపీకి 20శాతం నుంచి 35 శాతం ఓట్లు ఎలా పెరుగుతాయని ప్రశ్నించారు. 

140 సీట్లలో డిపాజిట్‌ కోల్పోయి కేవలం 36 సీట్లు గెలుచుకున్న జేడీఎస్‌ ప్రమాణస్వీకారానికి వెళ్లేందుకు చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారని ఆయన అన్నారు. పవన్‌, జగన్‌లను బీజేపీ నడిపిస్తే చంద్రబాబు ఎవరిని నడిపిస్తున్నారని అడిగారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎవరిని నడిపిస్తున్నారని ప్రశ్నించారు.