Asianet News TeluguAsianet News Telugu

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు తెలంగాణ అడ్డుతగలడం తగదు...: సోమిరెడ్డి

శ్రీశైలం వరద జలాలను వినియోగించుకునేందుకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచుతామంటే తెలంగాణ ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీలు రాద్ధాంతం చేయడం తగదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. 

sommireddy chandramohan reddy fires telangana government overpothireddypadu issue
Author
Guntur, First Published Aug 9, 2020, 2:43 PM IST

గుంటూరు: శ్రీశైలం వరద జలాలను వినియోగించుకునేందుకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచుతామంటే తెలంగాణ ప్రభుత్వంతో పాటు అన్ని పార్టీలు రాద్ధాంతం చేయడం తగదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. సముద్రంలో వృధాగా కలిసే వరద జలాలను వాడుకుంటామంటే అడ్డుపడతారా...? అని ప్రశ్నించారు. 

''ఏపీలో రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతం. దేశంలో అతి తక్కువ వర్షపాతం కలిగిన జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఇప్పటికే శ్రీశైలం జలాలు వినియోగించే ఆయకట్టు తగ్గింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న పట్టిసీమ, రాబోయే పోలవరంతో పాటు తెలంగాణలో నిర్మించిన పలు ప్రాజెక్టులతో శ్రీశైలంలో మిగులు జలాలున్నాయి..ఆ జలాలను రాయలసీమలో వాడుకుంటామంటే అడ్డుకుంటారా..?'' అని నిలదీశారు. 

''పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎన్టీఆర్ సృష్టి.హంద్రీనివా, గాలేరు నగరి, బ్రహ్మసాగరం, తెలుగు గంగ, సోమశిల, కండలేరు తదితర ప్రాజెక్టులన్నీ ఆయన ఆలోచనకు రూపాలే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టుల పనులను కొనసాగించాయి. చంద్రబాబు నాయుడు వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. పోతిరెడ్డిపాడును ప్రారంభంలో ఎన్టీఆర్ 14 వేల క్యూసెక్కుల సామర్ధ్యంతో చేపట్టగా వైఎస్సార్ 44 వేలకు పెంచారు'' అని వివరించారు. 

''తెలంగాణ సీఎం కేసీఆర్ ఏడాది క్రితం రాయలసీమకు వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేసే బాధ్యత నాదని స్పష్టంగా ప్రకటన చేశారు. ఈ రోజేమో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు. ఆంధ్రా వారైనా, తెలంగాణ ప్రజలైనా అన్నదమ్ములం...కలిసిమెలసివుంటాం. ఒకరి మంచి ఒకరం కోరుకుంటాం. అత్యంత దుర్భిక్షమైన ప్రాంతానికి  సాగునీరు, తాగునీరు అందిస్తుంటే సంతోషించాల్సిందిపోయి ఆక్షేపించడం దురదృష్టకరం'' అని అన్నారు. 

'' జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నరగా పాత ప్రాజెక్టులన్నింటినీ పడుకోబెట్టేసింది. ఎంతో కొంత ఖర్చుపెట్టుంటే టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అనేక ప్రాజెక్టులు పూర్తయి భారీగా ఆయకట్టు సాగులోకి వచ్చుండేది. ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు'' అని సోమిరెడ్డి వెల్లడించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios