సోమిరెడ్డి పరిస్ధితి రెంటికి చెడ్డ రేవడిలాగ తయారౌతోందని ఇప్పటికే పార్టీలో జోకులు వేసుకుంటున్నారట.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిస్ధితి ‘రెంటికి చెడ్డ రేవడి’లాగ తయారయ్యేట్లుంది. సోమిరెడ్డిది నెల్లూరు జిల్లా అన్న సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలోని స్ధానిక సంస్ధల కోటాలో భర్తీ చేయాల్సిన ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలే ఇపుడు సోమిరెడ్డి సామర్ధ్యానికి పెద్ద పరీక్షలాగ నిలిచాయి. ఎలాగంటే, నెల్లూరు, కడప రెండు జిల్లాలోనూ చెరో స్ధానం కోసం ఎన్నిక జరుగుతోంది. కడప జిల్లాలో ఎంఎల్సీ స్ధానాన్ని గెలిపించే బాధ్యత చంద్రబాబునాయుడు సోమిరెడ్డి మీద మోపారు. దాంతో ఈ సీనియర్ నేతకు ఇబ్బందులు మొదలయ్యాయి.
కడప జిల్లా జగన్ సొంత జిల్లా అన్న సంగతి అందరికీ తెలిసిందే. స్ధానిక సంస్ధల ఎన్నికలో వైసీపీ అభ్యర్ధులే ఎక్కువమంది గెలిచారు. రేపటి ఎన్నికల్లో ఓట్లు వేయాల్సింది జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, ఎంపిపిలే. కాబట్టి వైసీపీ అభ్యర్ధి గెలవటం తేలికే. పైగా అభ్యర్ది కూడా జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి కావటంతో వైసీపీ గెలుపును ప్రతిష్టగా తీసుకుంది. ఈ పరిస్ధితుల్లో సోమిరెడ్డి కాదు కదా మొత్తం టిడిపి అంతా కడపలో కూర్చున్నా టిడిపి గెలుపు కష్టమే. అటువంటిది సోమిరెడ్డిని కడపకు చంద్రబాబు ఎందుకు ఇన్ఛార్జ్ గా పెట్టారో అర్ధం కావటం లేదు.
ఇదిలావుంటే, నెల్లూరులో టిడిపి తరపు పోటీ చేస్తున్న వాకాటి నారాయణరెడ్డి గెలుపు కూడా డౌటే అంటున్నారు. ఇక్కడ కూడా వైసీపీ ఓట్లే ఎక్కువ. పైగా మొన్ననే ఓ ఎనిమిదిమంది స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు వైసీపీలో చేరారు. వారిని వైసీపీలో చేరకుండా సోమిరెడ్డి ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయారు. దాంతో టిడిపి అభ్యర్ధిలో టెన్షన్ మొదలైంది. అంటే, సొంతజిల్లా నెల్లూరులో గెలవలేక అటు కడపలోనూ ఓడిపోతే సోమిరెడ్డి పరువు ఏం కావాలి? దాంతో సోమిరెడ్డి పరిస్ధితి రెంటికి చెడ్డ రేవడిలాగ తయారౌతోందని ఇప్పటికే పార్టీలో జోకులు వేసుకుంటున్నారట. అయితే, అభ్యర్ధుల గెలుపుకు చంద్రబాబు ఏదో మంత్రం వేయకపోతారా అని సోమిరెడ్డి ఆశలు పెట్టుకున్నారట.
