అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కరోనా కోరలుచాస్తున్న వేళ విద్యార్థుల పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం పంతానికి పోవడం ఎంతమాత్రం మంచిదికాదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం కోవిడ్ బారినపడకుండా కాపాడగలదా? అని ప్రశ్నించారు. నా జీవితంలో ఇటువంటి భయానక పరిస్థితిని ఎన్నడూ చూడలేదని... తెలిసినవారి ప్రాణాలుపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వున్నానని సోమిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.   

''కోవిడ్ చికిత్స, ఆసుపత్రుల్లో సౌకర్యాలు, రెమిడెసివర్, వ్యాక్సిన్ల పంపిణీపై దృష్టిపెట్టకుండా ప్రభుత్వం పరీక్షలు పెడతామనడం దారుణం. ఏడాదిన్నర వయసున్న చిన్నారిని కాపాడలేని ప్రభుత్వం, లక్షలమంది విద్యార్థులను కాపాడుతుందా? విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్  నువ్వు ఇటురావద్దమ్మా... మేం పరీక్షలు నిర్వహిస్తున్నామని కరోనాకు లేఖ రాయాలి. అలాగయితేనే ఈ పరీక్షల వల్ల కరోనా వ్యాప్తి జరగదు'' అని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. 

''ప్రధానులు, మాజీ ప్రధానులు, దేశాధ్యక్షులనే ఈ మహమ్మారి వదల్లేదు.. మీరెంత అని కరోనా బదులిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు రద్దుచేసి జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేస్తే ఈ ప్రభుత్వం మొండితనానికి పోవడమేంటి?  కేంద్రఎన్నికల సంఘం ఓట్లలెక్కింపు ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఒక్కరూ కోవిడ్ నెగెటివ్ ఉంటేనే విధులకు రావాలని సర్క్యులర్ ఇచ్చింది. ప్రభుత్వంకూడా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కోవిడ్ టెస్ట్ లు చేయగలదా?'' అని సోమిరెడ్డి ప్రశ్నించారు.

read more   లోకేష్ తో పంతం కోసం... విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా..?: జవహర్ ఆగ్రహం (వీడియో) 

ఇదిలావుంటే టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ంటూ హైకోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లైంది. క‌రోనా సెకండ్ వేవ్ మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తున్న ద‌శ‌లో ఎట్టి ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌నుకుంటున్న ప్ర‌భుత్వానికి ఎన్ని విన‌తులు చేసినా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో విద్యార్థులు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఈ పిటిషన్ దాఖ‌లు చేశారు.

క‌రోనా ఉధృతంగా ఉన్న స‌మయంలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం విద్యార్థుల ప్రాణాల‌ను ప్ర‌మాదంలోకి నెట్ట‌డమేన‌ని వారు హెచ్చరించారు. ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయ‌డ‌మో, వాయిదా వేయ‌డ‌మో చేయాల‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప్ర‌భుత్వానికి లేఖ రాశారు.

అయినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోకుండా ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతామ‌ని ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు అభిప్రాయాలు తెలుసుకునేందుకు వాట్స‌ప్ నెంబ‌ర్ ఏర్పాటు చేశారు లోకేష్‌. దీనికి ల‌క్ష‌లాది మంది ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని సందేశాలు పంపారు.

అలాగే ఆన్‌లైన్‌లో నిర్వ‌హించిన టౌన్‌హాల్ మీటింగ్‌లో పిల్ల‌ల ప్రాణాలే ముద్దు, ప‌రీక్ష‌లు వ‌ద్ద‌నే అంశంపై న్యాయ‌పోరాటం చేయాల‌ని మెజారిటీ విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు క‌రోనా సెకండ్‌వేవ్ ప‌రిస్థితులు వివ‌రిస్తూ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని కోరుతూ బుధ‌వారం హైకోర్టులో పిల్ దాఖ‌లు చేశారు.