Asianet News TeluguAsianet News Telugu

వైసిపిలో వర్గపోరు... ఎమ్మెల్యే కాకాని అక్రమాలకు ఎంపీ మాగుంట బలి: సోమిరెడ్డి సంచలనం

సర్వేపల్లి నియోజకవర్గమంతా ఇష్టానుసారం గ్రావెల్, మట్టి తవ్వకాలు సాగిస్తున్న వైసిపి ఎమ్మెల్యే కాకాని ఆ నేరాన్ని తన పార్టీకే చెందిన ఎంపీ మాగుంటపై నెడుతున్నాడని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు.

somireddy chandramohan reddy reacts police case filed on ycp mp magunta akp
Author
Nellore, First Published Aug 5, 2021, 5:18 PM IST

నెల్లూరు:  ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు జిల్లా గడిచిన రెండేళ్లలో దౌర్జన్యాలు, దోపిడీలు, దుర్మార్గాలకు కేంద్రబిందువుగా మారిందన్నారు టీడీపీ  పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.  వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తన అనుచరులతో సొంత పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి సంతకాలు ఫోర్జరీ చేయించి మరీ సర్వేపల్లి రిజర్వాయర్ లో మట్టి తవ్వకాలకు తెరలేపారని సోమిరెడ్డి ఆరోపించారు. 

''అక్రమ మట్టి తవ్వకాలకు సంబంధించిన కథనాలు మే30న జర్నలిస్ట్ ఫ్రెండ్స్ గ్రూపుకి చెందిన వాట్సాప్ గ్రూపులో వార్తలొచ్చాయి.  అదేరోజు రాత్రి 7.08 ని.లకు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి  అన్నిఅనుమతులతోనే సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని... కొందరు బ్లాక్ మెయిలర్స్ దానిపై దుష్ర్పచారం చేస్తున్నారంటూ గ్రూపులో వచ్చిన మెసేజ్ పై స్పందించారు'' అని గుర్తుచేశారు. 

''సర్వేపల్లి నియోజకవర్గమంతా ఇష్టానుసారం గ్రావెల్, మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. కొన్నిగ్రామాల్లో జరుగుతున్న మైనింగ్ ను గ్రామస్తులే ఎక్కడికక్కడ అడ్డుకుంటూ, అవసరమైన ప్రాంతాలలో సీసీ.కెమెరాలు కూడా పెట్టా రు. జీపీఎస్ విధానం అమర్చి, వాహనాల గురించిన సమాచారం తీసుకొని మరీ గ్రామస్తులే స్వయంగా ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో కొన్ని వాహనాలను అడ్డుకున్న అధికారులు వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో ఏ2గా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు చేర్చారు. ఐపీసీ 427కింద, మాగుంటపై క్రిమినల్ కేసు పెట్టారు. ఒంగోలు ఎంపీ స్వయంగా మైనింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆయన పేరు చేర్చారు. మాగుంట అగ్రిఫామ్స్ అని ఆయనకు చెందిన సంస్థను కూడా ఫిర్యాదులో చేర్చారు'' అని సోమిరెడ్డి తెలిపారు. 

read more  రికార్డ్ బ్రేక్... చంద్రబాబు ఐదేళ్లలో చేసింది జగన్ కేవలం రెండేళ్లలోనే..: యనమల సంచలనం

''సాధారణమైన గ్రావెల్ తవ్వకాలకు ఎంపీ స్థాయి వ్యక్తి ఎలా దరఖాస్తు చేసుకుంటాడని అధికారులు ఆలోచించరా? అలా పెట్టుకొని ఉంటే దానిపై ఎంపీనీ గానీ, ఆయన కార్యాలయాన్ని గానీ సంప్రదించి నిజానిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారులపై లేదా? మట్టి తవ్వకాల పేరుతో పెట్టిన దరఖాస్తులు మూడూ ఒకే విధమైన దస్తూరితో ఉంటే, వాటిపై ఫోర్జరీ సంతకాలు పెడితే, దానిపై ఆలోచించరా? ఈ వ్యవహారంపై కాకాణి గోవర్థన్ రెడ్డి అంతా సక్రమంగానే ఉందని, అన్నిఅనుమతులతోనే గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని ఎలా చెబుతారు?'' అని ప్రశ్నించారు. 

''సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాణికి తెలియకుండా చీమకూడా చిటుక్కుమనదు. తవ్వకాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులే ఒక రిపోర్ట్  కూడా ఇచ్చారు. తాము 8వేల క్యూబిక్ మీటర్లకు అనుమతులిస్తే, 18వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు జరిగాయన్నారు. అది నిజమో కాదో పరిశీలించడానికి వెళ్లిన టీడీపీవారిపై అక్రమకేసులు పెట్టారు. మాజీ సర్పంచులు, ఇతర మాజీ ప్రజా ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని గోవర్థన్ రెడ్డి అనుంగు అనుచరుడే ఫోర్జరీ చేశాడు. ఒకే సంతకంతో మూడు దరఖాస్తులు వచ్చినప్పుడు ఇరిగేషన్ అధికారులు ఎందుకు పరిశీలించలేదు? కేసులు పెట్టేటప్పుడు అధికారులు ఎంపీ కార్యాలయాన్ని సంప్రదించరా? వైసీపీ ఎమ్మెల్యే  తాను సాగిస్తున్న అక్రమమైనింగ్ కోసం ఎంపీని బలిచేస్తారా?'' అని అడిగారు. 

''ఎంపీ మాగుంటపై ఎమ్మెల్యే కాకాణి కక్ష తీర్చుకున్నాడు. కాకాణి దోపిడీపై, అరాచకాలపై  తాము ముఖ్యమంత్రికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఆయన ఏనాడూ గోవర్థన్ రెడ్డిని పిలిచి విచారించలేదు. సర్వేపల్లి ఎమ్మెల్యే కనునసన్నల్లో అధికార పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఏ2గా ఎఫ్ఐఆర్ లో నమోదుచేయడం సామాన్య విషయమా? మాగుంట శ్రీనివాసులు రెడ్డి 1000క్యూబిక్ మీటర్లకు సంబంధించిన కేసులో ముద్దాయా? అలా చెప్పడానికి తమకే సిగ్గుగా ఉంది. వైసీపీ ఎమ్మెల్యే ఇష్టానుసారం గ్రావెల్ దోపిడీచేస్తూ, ఏమాత్రం సంబంధంలేని సొంతపార్టీ ఎంపీనే ఇరికించడం దేనికి సంకేతం?'' అన్నారు.

''ఎమ్మల్యేలు ఏంచేసినా, అధికారులు చూస్తూ ఊరుకోవాలని నెల్లూరు పర్యటనకు వచ్చిన సజ్జల చెప్పాడా ? అక్రమ మైనింగ్ ఎంతవరకు, ఏ స్థాయిలో జరిగిందో అధికారులే నిజాలు నిగ్గు తేల్చాలి. ఎంపీ సంతకం ఫోర్జరీ చేసిన కాకాణి అనుచరుడిపై క్రిమినల్ కేసులు నమోదుచేసి అరెస్ట్ చేయాలి. తప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ కృష్ణమోహన్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. శాఖాపరమైన విచారణ జరిపి, అతనిపై చర్యలు తీసుకోవాలి'' అని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios