Asianet News TeluguAsianet News Telugu

జిజిహెచ్ వద్ద హైడ్రామా..డాక్టర్లపై పోలీసుల ఒత్తిడి వల్లే: సోమిరెడ్డి

కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అర్ధరాత్రి బలవంతంగా డిశ్చార్జి చేయడానికి ప్రయత్నించడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

Somireddy chandramohan reddy reacts on Atchannaidu's discharge drama
Author
Guntur, First Published Jun 25, 2020, 11:46 AM IST

గుంటూరు:  కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అర్ధరాత్రి బలవంతంగా డిశ్చార్జి చేయడానికి ప్రయత్నించడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.  అచ్చెన్నాయుడి అరెస్ట్ నుంచి నిన్న అర్ధరాత్రి బలవంతపు డిశ్చార్జి హైడ్రామా వరకు ప్రభుత్వ కక్షసాధింపు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.  

''మూడు రోజులు ఆస్పత్రి బెడ్ పైనే విచారణకు అనుమతి ఇచ్చిన కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తారా? అర్ధరాత్రి డిశ్చార్జి చేయాలని డాక్టర్లపై పోలీసులు ఒత్తిడి తేవడం దుర్మార్గం. ఒకటికి రెండు సార్లు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న వ్యక్తితో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా?''  అని మండిపడ్డారు.

''అచ్చెన్నాయుడికి అరెస్ట్ చేసిన రోజు 14 గంటల పాటు కారులో తిప్పడం నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న వ్యవహారాల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. ఈ రాష్ట్రంలో సామాన్యుల నుంచి సీనియర్ ప్రజాప్రతినిధుల వరకు అందరి విషయంలో హక్కుల ఉల్లంఘన జరుగుతుండటం దురదృష్టకరం'' అంటూ సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

read more  ఏసీబీ కస్టడీకి అచ్చెన్నాయుడు: ఆస్పత్రిలోనే విచారణ

ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడి విషయంలో రాత్రికి రాత్రే కొత్త పరిణామం చోటు చేసుకుంది. అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు అచ్చెన్నాయుడిని ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

చికిత్స పొందుతున్న అచ్చెనాయుడిని ఆస్పత్రిలోనే న్యాయవాది, వైద్యుల సమక్షంలో విచారించాలని కోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో అచ్చెన్నాయుడు మంచం మీద పడుకుని సమాధానాలు ఇవ్వవచ్చునని కూడా స్పష్టం చేసింది. కూర్చోమని గానీ నిలుచోమని గానీ ఆయనను అడగకూడదని కూడా కోర్టు ఏసీబీ అధికారులకు చెప్పింది. 

 గుంటూరు జనరల్ ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెప్పించుకుని న్యాయమూర్తి వాటిని పరిశీలించారు. మూడు, నాలుగు రోజుల్లో ఆయనను డిశ్చార్జీ చేయవచ్చునని వైద్యులు చెప్పారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి.. అచ్చెన్నాయుడిని ఆస్పత్రిలోనే విచారించాలని ఏసీబీ అధికారులకు సూచించింది. 

అయితే, బుధవారం అర్థరాత్రి పరిణామాలు మారిపోయాయి. అచ్చెన్నాయుడిని గురువారమే డిశ్చార్జీ చేసేందుకు ఆస్పత్రి వర్గాలు సిద్దం చేసినట్లు తమకు తెలిసిందని అచ్చెన్నాయుడి తరఫు న్యాయవాదులు చెప్పారు. తనను చికిత్స నిమిత్తం సూపర్ స్పెషాలిటీ  ఆస్పత్రికి తరలించాలనే అచ్చెన్నాయుడిని అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. 

 అచ్చెన్నాయుడిని గురువారమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేయనున్నట్లు తెలుస్తోంది. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, పోలీసులు అధికారులు బుధవారం అర్థరాత్రి ప్రభుత్వాస్పత్రిని సందర్శించారు. అచ్చెన్నాయుడిని డిశ్చార్జీ చేయబోతున్నారనే సమాచారంతో బుధవారం రాత్రి జిజిహెచ్ కు వెళ్లి మాట్లాడామని ఆయన తరఫు న్యాయవాది హరిబాబు చెప్పారు. అర్థరాత్రి డిశ్చార్జీ పత్రం ఎలా ఇస్తారని అడిగితే ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారని సమాధానం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios