అమరావతి: కేంద్ర ఎన్నికల కమిషన్ పై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. నిబంధనల పేరుతో ఏపీలో అభివృద్ధిని ఈసీ అడ్డుకుంటోందని విమర్శించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తుంటే ఈసీ ఆ ప్రాజెక్టు పనులను అడ్డుకోవడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. 

ఎన్నికల కమిషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోక్యం ఎక్కువగా ఉందన్నారు. వైసీపీ ఫిర్యాదు చేస్తే క్షణాల్లో చర్యలు తీసుకుంటున్న ఈసీ మరి టీడీపీ ఫిర్యాదు చేస్తున్న ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో సాధారణ పరిపాలన జరుగుతున్నప్పుడు ఈసీ ఎలాంటి అభ్యంతరాలు చెప్పకూడదని నిలదీశారు. 

2003లో ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఆరు నెలలు కేర్ టేకర్ గవర్నమెంట్ గా యధాతథంగా పరిపాలన సాగించినట్లు చెప్పుకొచ్చారు సోమిరెడ్డి.  అలాంటిది ఇప్పుడు అన్నింటికీ ఈసీ అనుమతి అంటూ నిబంంధనలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. 

ఈసీ అతిగా ఆలోచిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం సమీక్ష చేయకూడదని దానికి ఈసీ అనుమతి తప్పనిసరంటూ చెప్పడం సరైన విధానం కాదన్నారు. ఈసీ నిబంధనలు పీఎంకు అయినా, సీఎంకు అయినా ఒక్కటేనని చెప్పుకొచ్చారు. 

ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మోదీ మూడు సార్లు కేబినెట్ భేటీ నిర్వహించారని ఆయనకు అవసరం లేని ఈసీ అనుమతులు ఏపీలో చంద్రబాబుకు అవసరమా అంటూ ప్రశ్నించారు. ఈసీ నిబంధనలు చంద్రబాబుకు మాత్రమే వర్తిస్తాయా, మోదీకి వర్తించవా అంటూ నిలదీశారు. 

ఇప్పుడు అన్నిటికి ఈసీ అనుమతి తీసుకోవాలని నిబంధన పెట్టడం సరికాదని సోమిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం చేతుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ బంధీ అయిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.