నెల్లూరు జిల్లాలో అధికార  టిడిపి పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం అధికార పార్టీలో వ్యవసాయ మంత్రిగా కీలక స్థానంలో వున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సోదరుడే ఊహించని షాకిచ్చాడు. ఆదివారం సోమిరెడ్డి సుధాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి  వైఎస్సార్‌సిపి కండువా కప్పుకున్నారు. 

సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో సుధాకర్ రెడ్డి వైఎస్సార్‌సిపిలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి, అక్రమాల కారణంగా సొంత కుటుంబ సభ్యులతో పాటు, కీలక టిడిపి నాయకులు తమ పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని  ఇంకా చాలామంది టిడిపి నాయకులు వైఎస్సార్‌సిపిలో చేరడానికి సిద్దంగా వున్నారని గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. 

తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. అందువల్లే  గత అసెంబ్లీ ఎన్నికల్లో సోమిరెడ్డి వై‌ఎస్సార్‌సిపి అభ్యర్ధి  చేతిలో ఓటమిపాలైనప్పటికి చంద్రబాబు అతన్ని మంత్రిని చేశారు. ఇలా నెల్లూరు జిల్లాలో కీలక నేతగా వున్న సోమిరెడ్డి కుటుంబ సభ్యులే పార్టీని వీడుతుండటంతో టిడిపి శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

కొద్దిరోజుల క్రితమే చంద్రమోహన్ రెడ్డికి స్వయానా బావ అయిన రామకోటారెడ్డితో పాటు ఆయన కుమారుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. తాజాగా ఇప్పుడు సోమిరెడ్డి సోదరుడు కూడా వైసిపిలో చేరడంతో టిడిపికి మరో షాక్ తగిలింది.