అమరావతి: తెలుగు సినిమాల్లో విలన్ గా నటించే సోనూ సూద్ ఒక్క సంఘటనతో తెలుగుప్రజల గుండెల్లో నిజమైన హీరోగా నిలిచిపోయారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓ సన్నకారు రైతు కుటుంబ  కష్టాన్ని చూసి చలించిపోయిన అతడు సాయం చేయడంతో తెలుగుప్రజల నుండే కాదు రాజకీయ ప్రముఖుల నుండి ప్రశంసలు పొందుతున్నారు. ఇలా ఇప్పటికే టిడిపి అధ్యక్షులు చంద్రబాబు సోనూ సూద్ ను ప్రశంసించగా తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అభినందించారు. 

''సోను సూద్ ను నేనైతే ఇక మిమ్మల్ని విలన్ గా చూడలేను. సినిమాల్లో మీరు హీరో పాత్ర వేయాల్సిందే. టాటా, మహీంద్ర, ఇన్ఫోసిస్ వంటి సంస్థల దాతృత్వాలు చూశాం. ఒక వ్యక్తికి ఇంత పెద్ద హృదయం ఉంటుందని ఊహించలేదు. వలస కూలీలకు సాయం, మదనపల్లి రైతుకు ట్రాక్టర్, విద్యార్థులు స్వదేశం రావడంలో మీ చొరవ అభినందనీయం'' అంటూ సోమిరెడ్డి ట్విట్టర్ వేదికన సోనూసూద్ ను కొనియాడారు. 

read more   మీరే మాకు స్ఫూర్తి... చంద్రబాబు ప్రశంసలకు సోనూసూద్ రిప్లై!

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ సన్నకారు రైతువద్ద పొలం దున్నేందుకు ఎద్దులు లేకపోవడంతో ఆయన ఇద్దరు కూతుళ్లు కాడి లాగుతూ పొలం దున్నారు. ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం బాలీవుడ్ నటుడు సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో ఆయన చలించిపోయారు.

దీంతో సోనూసూద్ వెంటనే స్పందించి.. వారికి ముందుగా రెండు ఎద్దులు అందిస్తున్నట్లుగా ప్రకటించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి వారి కష్టాలు తీరటానికి ఎద్దులు సరిపోవని... ఓ ట్రాక్టర్‌ను వారికి అందిస్తున్నట్లుగా ప్రకటించాడు.

 ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమ్రోగిపోతోంది. అనేక మంది సోనూసూద్‌ను అభినందిస్తున్నారు. ఈ లిస్టులో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరారు.

ఆ కుటుంబానికి ట్రాక్టర్ అందించడాన్ని అభినందించిన చంద్రబాబు సోనూసూద్ స్పందన అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. దళిత రైతు నాగేశ్వరరావు కుమార్తెల చదువు బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.