కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించారు. ఈ లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు చాలా అవస్థలు పడ్డారు. కాగా.. వారికి సహాయం చేయడానికి ముందుగా కదిలివచ్చింది.. సినీ నటుడు సోనూసూద్. అప్పటి నుంచి ఆయన వరసగా.. ఎవరికి ఏ అవసరం ఉన్నా తక్షణమే సాయం చేస్తున్నారు. ఏ ప్రాంతం, ఎవరు వారు అనేది లేకుండా అందరినీ ఆదుకుంటూ వస్తున్నారు.

తాజాగా.. చిత్తూరు జిల్లాలో ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్న ఓ కుటుంబం... కన్నకూతుళ్ల సహాయంతో పొలం దున్నింది. ఆ వీడియో నెట్టింట వైరల్ కాగా.. అందరూ వారి పరిస్థితిని చూసి చలించిపోయారు. అయితే.. సోనూసూద్ మాత్రం వారి ఇంటికి ట్రాక్టర్ పంపించి సహాయం చేశాడు.

 

సోనూసూద్ చేసిన సహాయం పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. సోనూసూద్ స్పందన అందరికీ స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించడంతో పాటు ఇక దళిత రైతు నాగేశ్వరరావు కుమార్తెల చదువుల బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ కూడా ఇచ్చారు. కాగా.. తాజాగా చంద్రబాబు ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చిన సోనూసూద్.. మీరు మాకు స్ఫూర్తి అంటూ తెలిపారు. త్వరలోనే మిమ్మల్ని కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నానని అన్నారు. 

‘‘మీ అభినందనలకు కృతజ్ఞతలు. మీలాంటి దయాహృదయం కలిగిన వారిచ్చే స్ఫూర్తితో.. పేదవారికి సహాయం చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు వస్తారు. మీ మార్గదర్శకత్వంలో లక్షలాది మంది వారి కలలను సాకారం చేసుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు. మీరిలా స్ఫూర్తినింపుతూనే ఉండాలి సార్. త్వరలో మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నాను..’’ అని సోనూసూద్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.