Asianet News TeluguAsianet News Telugu

Tirumala : గోవిందా... నీ భక్తులకు ఆ గోనెసంచులే దిక్కయ్యాయా...!

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లే భక్తులకు కొత్త సమస్య వచ్చిపడింది. కానీ కొందరు భక్తులు తెలివిగా ఆలోచించి గోనె సంచులతో ఆ సమస్య నుండి తప్పించుకున్నారు... ఇంతకూ శ్రీవారి భక్తుల సమస్య ఏంటంటే.... 

Some Devotees seen with jute bags to feet in Tirumala Temple premises AKP
Author
First Published Apr 8, 2024, 3:44 PM IST

తిరుమల : దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. దేశంలోనే రిచ్చెస్ట్ టెంపుల్... ప్రతిరోజు కేవలం హుండీ ఆదాయమే కోట్లల్లో వుంటుంది. ఇలా ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఆదాయంలో నెంబర్ వన్ గా వున్న ఆలయంలోనూ భక్తులకు ఇక్కట్లు తప్పడంలేదు. శ్రీవారి దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ప్రస్తుతం ఎండవేడికి తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇలా తిరుమలలో భక్తుల పరిస్థితిని కళ్లకుగట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తిరుమలలోనూ ఇదే పరిస్థితి వుంది. దీంతో ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండపైకి చెప్పులు ధరించకుండా వెళుతున్న భక్తుల కష్టాలు వర్ణనాతీతంగా వున్నాయి. మధ్యాహ్నం పూట మండుటెండలో బోసికాళ్లతో నడుస్తుంటే సుర్రుమనడం ఖాయం... అలాగని ఎక్కడో నీడలో నిల్చునివుంటే కుదరదు. దీంతో అటు తిరుమల పవిత్రతను దెబ్బతీయకుండా... ఇటు ఎండవేడిని తట్టుకునేలా కొందరు భక్తులు అద్భుతమైన ఆలోచన చేసారు.  

నిప్పుల కొలిమిలా మారిన కొండపై నడిచేందుకు భక్తులు గోనె సంచులను ఉపయోగిస్తున్నారు. లడ్డూ ప్రసాదాన్ని అందించే జూట్ బ్యాగులను కాళ్లకు కట్టుకుని నడుస్తూ వెళుతున్నారు. ఇలా పాదరక్షలు ధరించి తిరుమల పవిత్రతను దెబ్బతీయకుండా వుండటంతో పాటు ఎండవేడినుండి కూడా రక్షణ పొందుతున్నారు. జూట్ బ్యాగులను పాదరక్షలుగా చేసుకుని వెళుతున్న భక్తుల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Some Devotees seen with jute bags to feet in Tirumala Temple premises AKP
 
జూట్ బ్యాగులను కాళ్లకు ధరించిన భక్తుల ఆలోచనను కొందరు మెచ్చుకుంటుంటే మరికొందరేమో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపై సీరియస్ అవుతున్నారు. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో టిటిడి విఫలం అవుతోందని... అందువల్లే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంటున్నారు. ఎండాకాలం ఇలాంటి పరిస్థితి వుంటుందని తెలిసికూడా ఆలయ పరిసరాల్లో కూల్ పెయింట్ వేయకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా భక్తుల ఇబ్బందులను దృష్టిలో వుంచుకుని కూల్ పెయింట్ వేయాలని కోరుతున్నారు. 

టిడిపి సీరియస్ : 

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఎండవేడికి పడుతున్న ఇబ్బందులపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికన రియాక్ట్ అయ్యింది. ప్రతి సంవత్సరం  తిరుమల కొండపై కూల్ పెయింట్ వేస్తారని... ఈసారి మాత్రం అలా చేయలేదని అన్నారు. అందువల్లే భక్తులు కాళ్లు కాలకుండా గోనెసంచులను ఆశ్రయించాల్సి వచ్చిందని అంటున్నారు. కూల్ పెయింట్ వేయకుండా శ్రీవారి భక్తులను ముప్పుతిప్పలు ఎందుకు పెడుతున్నారు? అంటూ టిటిడిని ప్రశ్నిస్తోంది టిడిపి. 

 

నెటిజన్లు సైతం టిటిడి భక్తులతో వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతున్నారు. భక్తుల శ్రీవారికి సమర్పించే డబ్బులు కావాలి...కానీ వారికి సౌకర్యాలు కల్పించడం చేతకాదా? అంటూ నిలదీస్తున్నారు. దేశంలోనే రిచ్చెస్ట్ ఆలయంలో ఈ పరిస్థితి వుంటే ఇక మిగతా ఆలయాల్లో పరిస్థితి ఏమిటని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా శ్రీవారి భక్తుల జూట్ బ్యాగ్ వ్యవహారం సంచలనంగా మారింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios