పని ఒత్తిడి భరించలేక సాప్ట్ వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకున్న విషాద ఘటన కర్నూల్ లో చోటుచేసుకుంది. 

కర్నూల్ : లక్షల్లో జీతాలు తీసుకుంటూ రిచ్ లైఫ్ స్టైల్ అనుభవిస్తుంటారు సాప్ట్ వేర్ ఇంజనీర్లు. వారిని చూసి బ్రతికితే సాప్ట్ వేర్ ఇంజనీర్లలా బ్రతకాలని అనుకుంటారు. కానీ వారి పని ఒత్తిడి ఏ స్థాయిలో వుంటుందో ఎవరికీ కనిపించదు. పని ఒత్తిడి తట్టుకోలేక ఎంతోమంది టెకీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా కర్నూల్ జిల్లాలో ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే... కర్నూల్ జిల్లా బొమ్మనపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్-సీతమ్మ దంపతుల కుమారుడు సాయిప్రసాద్(25) సాప్ట్ వేర్ ఇంజనీర్. బెంగళూరులోని ఓ కార్పోరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పనిఒత్తిడిగా వుండటంతో కంపనీ మారాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పాడు.

రెండ్రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన సాయిప్రసాద్ అర్జెంట్ పనివుందని తల్లిదండ్రులకు చెప్పి తిరిగి బెంగళూరుకు వెళ్లాడు. ఆదివారం ఇంటికి చేరుకున్న అతడు రాత్రి కుటుంబసభ్యులంతా నిద్రిస్తున్న సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉదయం సాయిప్రసాద్ ఎంతకూ గదిలోంచి బయటకురాకపోవడంతో తల్లిదండ్రులు లోపలికి వెళ్లగా ఉరితాడుకు వేలాడుతూ కనిపించాడు. కొడుకు మృతదేహాన్ని చూసి షాక్ కు గురయిన పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని కిందకుదించి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. సాయిప్రసాద్ సూసైడ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.