కోనసీమ జిల్లాలో అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారంతా గోదావరి తీరానికి వచ్చి పనులు చేసుకుంటున్నారు. 

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ ఇటీవల అమలాపురంలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. మంత్రి, ఎమ్మెల్యేల నివాసాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా పోలీసులు కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను (internet services closed) నిలిపివేశారు. అయితే రోజులు గడుస్తున్నా ఇంటర్నెట్‌ను పునరుద్ధరించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముమ్మడివరం, అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీని కారణంగా ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ పనుల వివరాల నమోదు, డిజిటల్ లావాదేవీలు జరగడం లేదు. 

మరోవైపు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియా సహా వాట్సాప్, మెయిల్స్‌కు కోసం సిగ్నల్ కోసం యువత గోదావరి తీరానికి క్యూకడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వైపు లంకలు దాటుతున్నారు. మొబైల్ డేటా వస్తుంటే చాలు పండగ చేసుకుంటున్నారు. 

ఇకపోతే.. ప్రశాంతమైన కోనసీమ జిల్లాలో (konaseema district) అలజడి నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు జాగ్రత్తలు చేపట్టారు. ఆరోజు పట్టణంలో అలజడి సృష్టించినవారిపై అత్యంత కఠినంగా వ్యవహరించనున్నట్లు ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు తెలిపారు. అమలాపురంలో జరిగిన అల్లర్లలో పాల్గొన్న మరో 25మందిని శనివారం అరెస్ట్ చేసినట్లు డిఐజి తెలిపారు. నిందితులను అమలాపురం ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టిన సమయంలో డిఐజి కీలక వ్యాఖ్యలు చేసారు. 

Also Read:ఏపీ గవర్నర్‌తో కాంగ్రెస్ నేతల భేటీ.. సుబ్రమణ్యం హత్య, అమలాపురం అల్లర్లపై ఫిర్యాదు

అమలాపురం ఘటన పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని డిఐజి ఆరోపించారు. మొత్తం 20 వాట్సాప్ గ్రూపుల ద్వారా అమలాపురంలో అల్లర్లకు పథక రచన జరిగినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రైవేట్ ఆస్తులు ఈ అల్లర్లలో ధ్వంసమయ్యాయని... ఈ నష్టాన్ని నిందితుల నుండే రాబడతామని అన్నారు. ఇందుకోసం నిందుతుల ఆస్తులను సీజ్ చేయనున్నట్లు డిఐజి పాలరాజు హెచ్చరించారు. 

అమలాపురంలోని (amalapuram violence) సిసి కెమెరాల్లో రికార్డయిన పుటేజ్, అల్లర్ల సమయంలో పోలీసులు, మీడియా వీడియోలు, టవర్ లొకేషన్ లాంటి సాంకేతిక ఉపయోగించి నిందితుల గుర్తించామని డిఐజి తెలిపారు. ఇలా గుర్తించిన నిందితుల్లో ఇప్పటికే చాలామందిని అదుపులోకి తీసుకున్నామని... శనివారం మరో 25మందిని అరెస్ట్ చేసినట్లు డిఐజి వెల్లడించారు. ఇక ప్రస్తుతం అమలాపురంలో కొనసాగుతున్న 144 సెక్షన్ మరో వారంరోజులు పొడిగించనున్నట్లు డిఐజి తెలిపారు. అలాగే ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచారం జరగకుండా ఇంటర్నెట్ సేవలు మరో రోజు నిలిపివేయనున్నట్లు డిఐజి పాలరాజు వెల్లడించారు.