గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌తో ఏపీ  కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఇటీవల చోటు చేసుకున్న సుబ్రమణ్యం హత్య కేసు, అమలాపురం అల్లర్లపై వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా పోలీసులు పెద్ద‌గా స్పందించ‌డం లేద‌ని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 

రాష్ట్రంలో ఇటీవ‌ల చోటుచేసుకున్న ప‌లు కీల‌క ఘ‌ట‌న‌ల‌పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ (congress) నేత‌లు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌కు (governor biswabhusan harichandan) ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు ఆదివారం విజ‌య‌వాడ‌లోని రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లిన కాంగ్రెస్ నేత‌లు గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో నానాటికీ శాంతి భ‌ద్ర‌త‌లు దిగజారిపోతున్నాయని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబు (ysrcp mla anantha babu) తన మాజీ కారు డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని (subramanyam murder) దారుణంగా హ‌త్య‌కు చేసిన సంగతి తెలిసిందే. 

ఎమ్మెల్సీనే స్వ‌యంగా సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని చంపేసిన వైనాన్ని కాంగ్రెస్ నేత‌లు గ‌వ‌ర్న‌ర్‌కు వివ‌రించారు. అదే స‌మ‌యంలో కోన‌సీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అమ‌లాపురంలో చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌పైనా వారు గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న అత్యాచారాల‌పైనా పోలీసులు పెద్ద‌గా స్పందించ‌డం లేద‌ని కాంగ్రెస్ నేత‌లు గ‌వ‌ర్న‌ర్‌కు దృష్టికి తీసుకెళ్లారు. 

Also Read:కోనసీమ అల్లర్ల నిందితుల ఆస్తులు సీజ్... వారినుండే నష్టాన్ని రాబడతాం: డిఐజి పాలరాజు

మరోవైపు.. ప్రశాంతమైన కోనసీమ జిల్లాలో (konaseema district) అలజడి నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు జాగ్రత్తలు చేపట్టారు. ఆరోజు పట్టణంలో అలజడి సృష్టించినవారిపై అత్యంత కఠినంగా వ్యవహరించనున్నట్లు ఏలూరు రేంజ్ డిఐజి పాలరాజు తెలిపారు. అమలాపురంలో జరిగిన అల్లర్లలో పాల్గొన్న మరో 25మందిని శనివారం అరెస్ట్ చేసినట్లు డిఐజి తెలిపారు. నిందితులను అమలాపురం ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టిన సమయంలో డిఐజి కీలక వ్యాఖ్యలు చేసారు. 

అమలాపురం ఘటన పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని డిఐజి ఆరోపించారు. మొత్తం 20 వాట్సాప్ గ్రూపుల ద్వారా అమలాపురంలో అల్లర్లకు పథక రచన జరిగినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రైవేట్ ఆస్తులు ఈ అల్లర్లలో ధ్వంసమయ్యాయని... ఈ నష్టాన్ని నిందితుల నుండే రాబడతామని అన్నారు. ఇందుకోసం నిందుతుల ఆస్తులను సీజ్ చేయనున్నట్లు డిఐజి పాలరాజు హెచ్చరించారు. 

అమలాపురంలోని (amalapuram violence) సిసి కెమెరాల్లో రికార్డయిన పుటేజ్, అల్లర్ల సమయంలో పోలీసులు, మీడియా వీడియోలు, టవర్ లొకేషన్ లాంటి సాంకేతిక ఉపయోగించి నిందితుల గుర్తించామని డిఐజి తెలిపారు. ఇలా గుర్తించిన నిందితుల్లో ఇప్పటికే చాలామందిని అదుపులోకి తీసుకున్నామని... శనివారం మరో 25మందిని అరెస్ట్ చేసినట్లు డిఐజి వెల్లడించారు. ఇక ప్రస్తుతం అమలాపురంలో కొనసాగుతున్న 144 సెక్షన్ మరో వారంరోజులు పొడిగించనున్నట్లు డిఐజి తెలిపారు. అలాగే ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచారం జరగకుండా ఇంటర్నెట్ సేవలు మరో రోజు నిలిపివేయనున్నట్లు డిఐజి పాలరాజు వెల్లడించారు.