Kumari Aunty: వైసీపీ ప్రచారంలో సోషల్ మీడియా ఫేమ్ కుమారి ఆంటీ.. ఆమె ఏమన్నారంటే?
వైసీపీ ప్రచారంలో సోషల్ మీడియా ఫేమ్ కుమారి ఆంటీ భాగమైపోయారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా షేర్ చేసింది. తనకు ఆస్తేమీ లేదని, ఉన్నదల్లా జగన్ మోహన్ రెడ్డిగారు ఇచ్చిన ఇల్లు మాత్రమేనని వివరించింది.
YCP Campaign: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తున్నది. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, నాయకుల పార్టీ ఫిరాయింపులు, క్యాంపెయినింగ్, ప్రజా కర్షక నినాదాలు వంటివన్నీ కనిపిస్తున్నాయి. ప్రచారంలో అన్ని పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ప్రత్యక్ష ప్రచారాలతోపాటు సోషల్ మీడియా ప్రచారాలూ వేగమందుకున్నాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అయినవారు.. వైరల్ అయినవారు, ఇన్‌ఫ్లుయెన్సర్లను ప్రచారానికి వినియోగించుకుంటున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి సాయి కుమారి ఆంటీ కూడా చేరారు. ఆమె గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారారు.
దుర్గం చెరువులో ఇనార్బిట్ మాల్‌కు ఎదురుగా రోడ్డు పక్కనే ఆమె మీల్స్ పాయింట్ ఉన్నది. ఆమె మీల్స్ వండి సర్వ్ చేస్తూ ఉంటుంది. ఇటీవల ఆమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ముఖ్యంగా ‘రెండు లివర్లు ఎక్స్‌ట్రా..’ అనే వీడియో తెగ వైరల్ అయింది. కుమారి ఆంటీ మీల్స్ పాయింట్ వద్ద భోజనాల కోసం జనాలు బారులు తీస్తుంటారు. ఆమె సంపద గణనీయంగా పెరిగిందనే చర్చ జరిగింది. తాజాగా, ఆమె వీడియో క్లిప్‌ను వైసీపీ సోషల్ హ్యాండిల్ ఒకటి పోస్టు చేసింది.
సామాన్యులే నా స్టార్ క్యాంపెయినర్లు అని సీఎం @ysjagan గారు చెప్తే.. వెటకారం చేసిన పెత్తందారులకి దిమ్మతిరిగిపోయేలా చేసిన దాసరి సాయి కుమారి.
— YSR Congress Party (@YSRCParty) January 30, 2024
సోషల్ మీడియాలో ఇటీవల ఫేమస్ అయిన ఆమె తనకంటూ ఆస్తి ఉందంటే.. అది జగనన్న ఇచ్చిన ఇల్లు మాత్రమే అని ఇంటర్వ్యూలో చెప్పింది.
మంచి చేస్తే… pic.twitter.com/Mn5Wbk4gn9
మీల్స్ పాయింట్‌తో ఆమె చాలా డబ్బు కూడబెట్టుకున్నదని, ఊరిలో వాళ్లకు ఎకరాలకు ఎకరాలు పొలాలు ఉన్నాయని కామెంట్లు వచ్చాయి. కుమారి ఆంటీని ఓ ఇంటర్వ్యూయర్ ఇదే ప్రశ్న వేశారు. నిజంగానే ఊరిలో అంత పొలం ఉన్నదా? అని అడగ్గా.. కుమారి ఆంటీ సమాధానం చెప్పారు. అసలు తమకేమీ ఆస్తులు లేవని వివరించారు. కావాలంటే తన ఆధార్ నెంబర్ ఇస్తానని తెలిపారు. ఆ నెంబర్‌తో చెక్ చేయండని, తనకేమీ లేదని తెలుస్తుందని పేర్కొన్నారు. అయితే, తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉన్నదని, మొన్న తనకు ఇల్లు వచ్చిందని చెప్పారు.
Also Read: రాజ్యసభ ఎన్నికలు: వైసీపీ, టీడీపీ బలాబలాలు.. ఆ ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడితే పరిస్థితులు ఏమిటీ?
ఈ వీడియో క్లిప్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేసింది. ఈ వీడియోకు ఓ కామెంట్ కూడా జోడించింది. సామాన్యులే తన స్టార్ క్యాంపెయినర్లు అని సీఎం జగన్ చెప్పారని, ఇలా చెబితే పెత్తందారులు వెటకారం చేశారని, ఇప్పుడు దాసరి సాయి కుమారి సమాధానంతో వారికి దిమ్మతిరిగిపోయిందని పేర్కొంది. తనకంటు ఉన్న ఆస్తి కేవలం జగన్ ఇచ్చిన ఇల్లు మాత్రమేనని చెప్పుకున్నారని వివరించింది.