ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్‌కు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులు విశాఖ రైల్వే స్టేషన్లో కాపుకాసి...స్మగర్లను అత్యంత చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. వీరి నుండి దాదాపు మూడు కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితులను రైల్వే పోలీసులకు అప్పగించారు.

నిందితులు బంగారాన్ని తరలించే  విధానాన్ని చూసి డీఅఆర్ఐ అధికారులే ఆశ్యర్యపోయారు. స్మగర్లు కేవలం తమ చొక్కా జేబుల్లోనే బంగారాన్ని రహస్యంగా పెట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా చూసుకున్నారు. ఇలా జేబుల్లోనే దాదాపు 3 కోట్ల విలువైన 3కిలోలకు పైగా బరువున్న బంగారాన్ని తరలించడాన్ని చూసి అధికారులే ఆశ్యర్యం వ్యక్తం చేశారు. 

ఈశాన్య రాష్ట్రాల్లోని గౌహతి నుండి రైలు మార్గం ద్వారా ఈ బంగారాన్ని హైదరాబద్ కు తరలిస్తుండగా పట్టుకున్నట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు తెలిపారు. పట్టుబడిన నిందితులిద్దరిని రైల్వే పోలీసుల సాయంతో విచారిస్తున్నట్లు వెల్లడించారు. స్మగర్లపై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.