తిరుపతి - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడం కలకలం రేపింది. మూడో బోగీలోని బాత్‌రూమ్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణీకులు సిబ్బందిని అప్రమత్తం చేశారు.

తిరుపతి - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న వందే భారత్ రైలు నెల్లూరు జిల్లా మనుబోలు స్టేషన్‌కు రాగానే.. మూడో బోగీలోని బాత్‌రూమ్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణీకులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. అనంతరం వారు వచ్చి పరిశీలించగా.. బాత్‌రూమ్‌లో కాల్చి పడేసిన సిగరెట్ ముక్క పక్కనే వున్న ప్లాస్టిక్ సామాగ్రికి అంటుకోవడంతో పొగలు వచ్చినట్లుగా నిర్ధారించారు.

వెంటనే రైలును మనుబోలులో నిలిపివేశారు. ప్రయాణీకులను కిందకు దించి మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ ఘటనకు కారణమైన ప్రయాణీకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద టికెట్ లేదని గుర్తించారు. ఈ ఘటన కారణంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది.