ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరికి గాయాలు
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం పర్యటనలో వివాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి పవన్ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో బస చేశారు.
కాగా ఆ కళ్యాణ మండపం వద్ద వివాదం చోటుచేసుకొని.. అది ఉద్రిక్తతకు దారి తీసింది.
మంగళవారం అర్ధరాత్రి కల్యాణ మండపం వద్దకు కొంత మంది విద్యుత్తు సిబ్బంది వచ్చారు. పవన్ కల్యాణ్ బయటకు రావాలని నినదించారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్ బయటకు రారని, బుధవారం ఉదయం వస్తే కలవవచ్చని వారితో కల్యాణమండపం వద్ద కాపలా ఉన్న ప్రైవేటు సిబ్బంది చెప్పారు.
ఆయన ఎలా బయటికి రారో చూస్తామంటూ విద్యుత్తు సరఫరాను సిబ్బంది నిలిపేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగి కొట్లాటకు దారితీసింది. పవన్ కల్యాణ్ బౌన్సర్ సునీల్ కాలికి గాయమైంది. కాశీబుగ్గ సీఐ అశోక్‌కుమార్ ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కల్యాణమండపానికి విద్యుత్తు సరఫరాను సిబ్బంది పునరుద్ధరించారు.
