పశ్చిమగోదావరి జిల్లా వసంతవాడ వాగు ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. వాగులో మునిగి ఆరుగురు విద్యార్థుల మరణించడంపై వెంటనే స్పందించిన ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఈ విషయాన్ని సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ప్రమాదంలో 
మరణించిన ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది జగన్ సర్కార్. 

ఆరుగురు మృతుల కుటుంబాలకు రూ.18 లక్షలు అందజేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. మృతి చెందిన ఆరుగురు కూడా విద్యార్థులు, యువకులు కావడంతో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలు రాజు, ఎస్పీ నారాయణ నాయక్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తో ఫోన్ లో మాట్లాడి ఘటన పై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. 

read more  వనభోజనాల్లో విషాదం.. వాగులో పడి ఆరుగురు విద్యార్థులు గల్లంతు..

ఇక విద్యార్థుల మృతి పట్ల గవర్నర్ హరిచందన్ బిశ్వభూషన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకుని తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.  సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి వెళ్ళిన చిన్నారులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు.  

భూదేవిపేట గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్లగా  సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగిన గొట్టుపర్తి మనోజ్‌(16), కోనవరపు రాధాకృష్ణ(16), కర్నాటి రంజిత్‌(16), శ్రీరాముల శివాజి(17), గంగాధర్‌ వెంకట్‌(17), చల్లా భువన్‌(18) గల్లంతయ్యారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టి గల్లంతైన వారి మృతదేహాలను వెలికితీశారు. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు తన సానుభూతిని ప్రకటించిన గవర్నర్ హరి చందన్. పిల్లల విషయంలో ఏమరుపాటు తగదని హితవు పలికారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.