పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడులో ఈత కొట్టేందుకు వాగులోకి దిగి ఆరుగురు విద్యార్థులు గల్లంతైన ఘటన కలకలం సృష్టించింది. బుధవారంనాడు వసంతవాడ సమీపంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెడితే.. 

వేలేరుపాడు మండలం భూదేవిపేట గ్రామానికి చెందిన కొందరు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్లారు. సరదాగా వాగులో ఈత కొడదామని మనోజ్, రాధాకృష్ణ, రంజిత్, శివాజి, గంగాధర్ వెంకట్, భువన్ లు వాగులోకి దిగారు. వాగు ఉదృతికి వీరంగా కనిపించకుండా పోయారు. వీరంతా 16, 18 యేళ్ల వయసువారే కావడం గమనార్హం.

పిల్లలు గల్లంతు కావడంతో వారితో వచ్చిన మిగతావారు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్సై టి. సుధీర్ ఘటనా స్థలికి చేరుకుని గజఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. 

ఇప్పటివరకు గంగాధర్ వెంకట్, శివాజి, రాధాకృష్ణ, రంజిత్ మృతదేహాలు దొరికాయి. మరో ఇద్దరి ఆచూకీ తెలియలేదు. వీరికోసం గాలింపు కొనసాగుతుంది.