ఎన్టీఆర్ జిల్లాలో దారుణం... మానసిక రోగిపై నెలల తరబడి ఆరుగురు మృ(మ)గాళ్ల లైంగికదాడి
అభం శుభం తెలియని దళిత మానసిక రోగిపై కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై వైసిపి నేత బరిగల కోటేష్ ఆవేదన వ్యక్తం చేసారు.

విజయవాడ : మతిస్థిమితం సరిగ్గా లేని దళిత యువతిపై కొందరు అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసారు. కొన్ని నెలలుగా యువతిపై అఘాయిత్యానికి పాల్పడగా ఆమె గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.
తిరువూరు నియోజకవర్గంలోని ముష్టికుంట గ్రామానికి చెందిన ఓ యువతి మానసిక రోగి. ఆమె తల్లి చనిపోయింది... తండ్రి పక్షవాతంతో మంచాన పడ్డాడు. దీంతో ఆమె బాగోగులు చూసేవారు లేకుండాపోయారు. ఇలా ఆమె దీన పరిస్థితి చూసి అందరూ బాధపడితే కొందరు మాత్రం ఆడతనాన్నే చూసారు. అదే గ్రామానికి చెందిన ఆరుగురు ఆమెపై కన్నేసి ఒకరికి తెలియకుండా ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా కొన్ని నెలలుగా ఆమెపై ఈ మృగాలు అఘాయిత్యానికి పాల్పడుతూ వస్తున్నారు.
ఇటీవల యువతి గర్భం దాల్చడంతో విషయం బయటకు వచ్చింది. కానీ ఈ విషయాన్ని గుట్టుగా వుంచేందుకు కొందరు పెద్దమనుషులు ప్రయత్నించారు. యువతి మానానికి విలువకట్టి ఆమెపై అఘాయిత్యాన్ని పాల్పడిన దుర్మార్గులను కాపాడే ప్రయత్నం చేసారు. యువతికి గుట్టుగా అబార్షన్ కూడా చేయించారు.
Read More వివాహేతర సంబంధం : తోటి కానిస్టేబుల్ దంపతుల దాడిలో గాయపడిన సిసిఎస్ సీఐ ఇఫ్తేకార్ అహ్మద్ మృతి..
అయితే పెద్దల పంచాయితీతో న్యాయం జరగలేదని భావించిన బాధిత యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో తిరువూరు పోలీసులు ఆత్యాచారానికి పాల్పడిన ఆరుగురిని అరెస్ట్ చేసారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మతిస్థిమితం లేని దళిత యువతిపై జరిగిన లైంగికదాడిపై స్థానిక వైసిపి నేత బరిగల కోటేష్ ఆవేదన వ్యక్తం చేసారు. మతిస్థిమితం లేకుండా దీనస్థితిలో వున్న ఆమెపై కనీసం జాలి, దయ చూపించకుండా ఇలా అత్యాచారానికి పాల్పడటం దారుణమన్నారు. అభాగ్యురాలిపై అత్యాచారానికి పాల్పడినవారినే కాదు పంచాయితీ చేసి నిందితులను కాపాడేందుకు ప్రయత్నించి పెద్దలు, అబార్షన్ చేసిన డాక్టర్ ను అరెస్ట్ చేయాలని కోటేష్ డిమాండ్ చేసారు.
బాధిత దళిత మహిళకు తాను అండగా వుంటానని కోటేష్ హామీ ఇచ్చారు. ఏ కష్టం వచ్చినా తనకు తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వం తరపున సాయం అందేవిధంగా చూస్తానని అన్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంటానని... త్వరలోనే అన్ని ఆధారాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసి బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని కోరతానని బరిగల కోటేష్ తెలిపారు.