విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంపై శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ధర్మం గెలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. 

విజయవాడలో మీడియాతో మాట్లాడిన శివస్వామి దేశంలోనూ, రాష్ట్రంలోనూ ధర్మం గెలిచిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన అరాచక పాలనకు ప్రజలు స్వస్తి పలికారని స్పష్టం చేశారు. 40 ఏళ్ల సీనియారిటీ ప్రజలకు నష్టం కలిగించిందే తప్ప ఉపయోగపడలేదని ఆయన ఆరోపించారు. 

ఎన్నికలకు ముందు 35వేల ఎకరాల ఇనామ్ భూములపై ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఖండిస్తున్నామన్నారు. కొత్త సీఎం ఈ జీవోపై స్పందించాలని దానిని రద్దు చేయాలని కోరారు. రాష్ట్రప్రజల శ్రేయస్సు కోసం త్వరలోనే యాగం నిర్వహిస్తానని స్పష్టం చేశారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు అమోఘమని శివస్వామి కొనియాడారు. జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నూతన ప్రభుత్వం పాలన అందించాలని ఆకాంక్షించారు. అన్ని మతాలకు సమాన గౌరవం ఇవ్వాలని సూచించారు. ఇకపోతే ప్రధాని నరేంద్రమోదీ హయాంలో దేశం భద్రంగా ఉందని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి వ్యాఖ్యానించారు.