ముంబై: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన  జగన్మోహన్‌ రెడ్డిపై శివసేన ప్రశంసల జల్లు కురిపించింది. ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీని భారీ తేడాతో ఓడించి అఖండ విజయాన్ని చేజిక్కించుకున్న జగన్‌ని ‘విజయ వీరుడు’గా అభివర్ణించింది. గురువారం వారి అధికారిక పత్రిక సామ్నాలో ప్రచురించిన సంపాదకీయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే మోడీని కలిసిన జగన్‌ ఏపీ రాష్ట్ర డిమాండ్లపై చర్చించారని శివసేన గుర్తు చేసింది. వాటికి మోడీ అంగీకరించినట్లు తెలిపింది. బిజెపి మాత్రం రాష్ట్రంలో ఘోర పరాజయాన్ని చవి చూసిందని వ్యాఖ్యానించింది. 

మోడీ ప్రమాణస్వీకారానికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాకపోవడంపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది.  మోడీ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపడితే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని విపక్షాలు ప్రజల్లో అనుమానాలు రేకెత్తించాయని అన్నది. మోడీని నియంతగా ప్రచారం చేసిన వారిలో మమతా బెనర్జీ ముందున్నారని గుర్తు చేసింది. మోడీ మాత్రం ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికల్లో గెలిచి రాజ్యాంగం ప్రకారం ప్రమాణంచేయబోతున్నారని తెలిపింది. 

ప్రమాణ స్వీకారానికి పాక్‌ ప్రధానిని ఆహ్వానించకపోవడంపై కూడా శివసేన స్పందించింది. ప్రజల ఆకాంక్షల మేరకే ప్రభుత్వం నడుచుకుంటుందని వెల్లడించింది.