బ్రిటన్ కు చెందిన ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్ధ రూపొందించిన డిజైన్లను చంద్రబాబునాయుడు విడుదల చేసారు.

అమరావతికి తాజాగా కొత్త డిజైన్లు వచ్చాయి. అంటే సింగపూర్ అభిరుచి పోయి లండన్ టేస్ట్ మొదలైంది. బ్రిటన్ కు చెందిన ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్ధ రూపొందించిన డిజైన్లను చంద్రబాబునాయుడు విడుదల చేసారు. నూతన డిజైన్ల ప్రకారం రాజధానిలోని ప్రభుత్వ పరిపాలనా నగరం మొత్తం విద్యుత్ ఆధారిత ప్రజా రవాణా వ్యవస్ధే ఉంటుంది. మచ్చుకి కూడా ఎక్కడా పెట్రోలు, డీజల్ వాహనాలు కనబడవన్నమాట. అలాగే, నగరానికి పులిచింతల నుండి జలమార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భూగర్భమార్గంలో మెట్రోరైలు, జలమార్గంలో వాటర్ ట్యాక్సీలు ఇలా ఎక్కడా కాలుష్యమన్నది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రాజధాని ప్రాంతంలో 51 శాతం ఆకుపచ్చని ప్రదేశం, 10 శాతం జలభాగం, 14 శాతం రహదారులు, 25 శాతం భవంతులుంటాయి. అంటే 10 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలుంటాయి. సహజ సిద్ధమైన పచ్చికబయళ్ళు, వికసించే పచ్చని వృక్షాలతో ప్రజా ఉద్యానవనాలుంటాయి. స్ధానికంగా తయారయ్యే వస్తు సామగ్రి, ఉత్పత్తులను వినియోగించాలని చంద్రబాబు ఫోస్టర్ కు స్పష్టచేసారు. విద్యాసంస్ధలు ఒకేచోట కేంద్రీకృతం కాకుండా రాజధాని మొత్తంలో విస్తరింపచేస్తారు.

రాజధాని నిర్మాణంలో రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన సంస్కృతి, కళలు, హస్తకళలు, మ్యూజియంలు, కళాకేంద్రాలుంటాయి. వారసత్వ చిహ్నాలు, చల్లని గాలులు, ఆహ్లాదభరితంగా ఉండే పరిసరాలు, హరిత ఉద్యానవనాలుంటాయి. ఎక్కడికెళ్లినా ఉష్ణోగ్రతలు చల్లబరిచే సహజసిద్ధమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిని ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్న సిఎం ఆలోచనలకు అనుగుణంగా ఫోస్టర్ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. మొత్తం మీద వింటుంటే ఏదో హాలివుడ్ సెట్టింగ్ లాంటివి కళ్ళముందు సాక్షాత్కరిస్తున్నాయ్ కదా? అది నిజమే అయితే డిజైన్లు గొప్పతనమే.