విశాఖపట్నం: సింహాచలం దేవస్థానంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవస్థానం ఈవో ఎం వెంకటేశ్వరరావు పై బదిలీ వేటు వేసింది. రాజమండ్రి రీజనల్ జాయింట్ కమీషనర్ భ్రమరాంబను సింహాచలం  నూతన ఈవోగా నియమించింది ప్రభుత్వం.   

సింహాచలం అప్పన్న ఆలయంలో అక్రమాలపై ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దేవాదాయ శాఖ ఏడిసి ఆజాద్ ఆద్వర్యంలో జరిగిన ఈ విచారణ పూర్తవగా ప్రభుత్వానికి నివేదిక కూడా అందింది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది.  ఈవోని బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈవోతో పాటు దేవస్థానం భూ పరిరక్షణ విభాగం ఎస్‌డిసి శేషశైలజ, సర్వేయర్ సాయి కృష్ణలను మాతృ సంస్థకు సరెండర్ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

అదేవిధంగా దేవాలయ భూములు చోటుచేసుకున్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి  అవినీతికి పాల్పడి భూ పరిరక్షణ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఏఈవోలు, ఒక సూపరిండెంట్ గుమస్తాతో పాటు అసిస్టెంట్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన శాఖకు సరెండర్  చేయనున్నట్లు తెలిసింది.  

read more   కొండపై అక్రమాలు, క్వారీయింగ్‌కు అడ్డుచెప్పని వైనం: సింహాచలం ఈవోపై వేటు

ఇదిలా ఉండగా దేవస్థానంలో లో అక్రమ క్వారీల కు సంబంధించి సుమారు 19 లక్షల రూపాయలు రికవరీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.  సింహాచలం దేవస్థానంలో జరిగిన అక్రమాలపై  త్రిసభ్య కమిటీతో దేవాదాయ శాఖ విచారించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సింహాచలం దేవస్థానంలో జరిగిన అవినీతి అక్రమాలపై మరో కమిటీ సైతం ప్రభుత్వానికి నివేదిక  అందజేసినట్లు ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

సింహాచల దేవస్థానం ఈవోగా  రాజమండ్రి రీజనల్ జాయింట్ కమీషనర్ భ్రమరాంబ నియమితులయ్యారు. గత కొద్దీ రోజులుగా సెలవులో వున్న ఆమె  రాజమండ్రి కార్యాలయంలో  సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెను ఇంచార్జి ఈవో గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.