ఎన్నికల్లో టిడిపికి సమానంగా ఖర్చు పెట్టుకునే ఆర్ధికస్తోమత కలిగిన నేతలు పార్టీలో లేరు. ఇక్కడే శిల్పాకు బాగా కలిసివచ్చిందని వైసీపీ వర్గాలంటున్నాయి. రేపటి ఉపఎన్నికల్లో శిల్పాకు జగన్ టిక్కెట్టు కేటాయిస్తే ఆర్ధిక పరిస్ధితిని చూసి ఇవ్వాల్సిందే. మరి, జగన్ మనస్సులో ఏముందో?
మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరారు. లోటస్ పాండ్ లో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈరోజు ఉదయం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. నంద్యాలలోని తన మద్దతుదారులతో పార్టీ కండువా కప్పుకున్నారు. గంగుల ప్రభాకర్ రెడ్డి, కర్నూలు ఎంపి బుట్టా రేణుక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైనప్పటి నుండి జిల్లా రాజకీయం మొత్తం శిల్పా చూట్టూనే తిరుగుతోంది. నంద్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ సులోచనతో 24 మంది కౌన్సిలర్లు, ఎంపిటిసిలు, సర్పంచులు పాటు వివిధ స్ధాయిల్లోని నేతలు, కార్యకర్తలు సుమారు 2 వేల మంది వైసీపీలో చేరారు.
శిల్పా టిడిపి నుండి వైసీపీలోకి చేరటం తెలుగుదేశంపార్టీకి పెద్ద దెబ్బగానే అనుకోవాలి. ఎందుకంటే, ఆర్ధికంగా గట్టిస్ధితిలో ఉండటమే కాకుండా నియోజకవర్గమంతా అనుచరగణం కలిగిన నేతగా శిల్పాకు పేరుంది. ఉప ఎన్నికల్లో టిక్కెట్టు విషయంలో చంద్రబాబుతో విభేదించిన శిల్పా టిడిపికి గుడ్ బై చెప్పారన్న విషయం అందరికీ తెలిసిందే.
క్షేత్రస్ధాయిలో వైసీపీకి గట్టి పట్టుంది. అయితే, రానున్న ఉప ఎన్నికలను ధీటుగా ఎదుర్కోగలిగిన నేతలు పెద్దగా లేరు. అధికారంలో ఉండటం, యంత్రాంగం చెప్పుచేతుల్లో ఉండటంతో పాటు ఆర్ధికంగా ఎటువంటి లోటు లేకపోవటం టిడిపికి బాగా ప్లస్ పాయింట్.
వైసీపీ విషయం చూస్తే క్షేత్రస్ధాయిలో బాగానే పట్టుంది. మొన్ననే గంగుల కుటుంబం కూడా వైసీపీలోకి వచ్చింది. జనాల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. అయితే, ఎన్నికల్లో టిడిపికి సమానంగా ఖర్చు పెట్టుకునే ఆర్ధికస్తోమత కలిగిన నేతలు పార్టీలో లేరు. ఇక్కడే శిల్పాకు బాగా కలిసివచ్చిందని వైసీపీ వర్గాలంటున్నాయి. రేపటి ఉపఎన్నికల్లో శిల్పాకు జగన్ టిక్కెట్టు కేటాయిస్తే ఆర్ధిక పరిస్ధితిని చూసి ఇవ్వాల్సిందే. మరి, జగన్ మనస్సులో ఏముందో?
