బైరెడ్డికి ఝలక్: జగన్ పార్టీలోకి సిద్ధార్థ రెడ్డి

First Published 25, Jun 2018, 3:51 PM IST
Sidhatha Reddy to join in YCP
Highlights

తన రాజకీయ వారసుడు సిద్ధార్థ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డికి ఝలక్ ఇవ్వడానికి సిద్దపడ్డారు.

కర్నూలు: తన రాజకీయ వారసుడు సిద్ధార్థ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డికి ఝలక్ ఇవ్వడానికి సిద్దపడ్డారు. సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా గుర్తింపు పొందారు. జగన్ పేరు చెప్తే ఒంటి కాలి మీద లేచే బైరెడ్డి రాజశేఖర రెడ్డి తమ్ముడు సిద్ధారెడ్డి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్దపడినట్లు తెలుస్తోంది. 

స్వయానా పెద్దనాన్న అయిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి అడుగు జాడల్లో సిద్ధార్థ రెడ్డి నడుస్తూ వచ్చారు. అయితే, తాజాగా ఆయన తన సొంత మార్గం వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థ రెడ్డి తొలుత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ అది కుదరలేదని సమాచారం. నిజానికి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నం కూడా ఇంత వరకు సఫలం కాలేదు. 

తనపై కేసులు నమోదు కావడం వల్ల కూడా కొంత కాలంగా సిద్ధార్థ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా, ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 

సిద్ధార్థ రెడ్డికి వైఎస్ జగన్ లైన్ క్లియర్ చేసినట్లు చెబుతున్నారు. అయితే, వైఎస్సార్ కాంగ్రెసులో చేరే ముహూర్తం ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది.

loader