టీడీపీ దివంగత నేత పరిటాల రవి అనుచరుడు.. టీడీపీకి షాకిచ్చాడు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పరిటాల రవి అనుచరుడు రేగాటిపల్లి మధుసూదన్ రెడ్డి ప్రకటించారు.

ధర్మవరంలో మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో తనకు 26 సంవత్సరాల అనుబంధముందన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే తాను పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.

 కార్యకర్తల నిర్ణయం మేరకు ఏ పార్టీలో చేరేదీ వెల్లడిస్తానన్నారు. గతంలో తాను సింగిల్‌ విండో అధ్యక్షుడిగా, సర్పంచుగా పనిచేశానన్నారు.  కాగా.. మధు.. జనసేన పార్టీలో చేరేందుకు పవన్‌ కల్యాణ్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. 

ధర్మవరం నుంచి జనసేన తరుపున పోటీ చేయడానికే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారని ఆయన అనుచరులు బాహాటంగా చెబుతున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుర్రప్ప, కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బెస్త శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ రామాంజనేయులు పాల్గొన్నారు.