Asianet News TeluguAsianet News Telugu

బాబుకు గట్టి షాక్: పార్టీ వీడనున్న ముగ్గురు సీనియర్లు

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు వరుపుల రాజా, పంచకర్ల రమేశ్ బాబుతో పాటు అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన అడారి ఆనంద్ కుమార్‌ పార్టీని వీడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత వరుపుల రాజా ఇప్పటికే టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు

Shock for Chandrababu, 3 senior TDP leaders quit
Author
Amaravathi, First Published Aug 30, 2019, 8:21 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతలు పక్కచూపులు మళ్లీ మొదలయ్యాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి ఒకరి వెంట ఒకరు పార్టీని విడిచి బీజేపీ, వైసీపీల గూటికి చేరిన పచ్చ నేతలు.. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చారు. అయితే గురువారం రాజీనామాల పరంపర మళ్లీ మొదలైంది.

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు వరుపుల రాజా, పంచకర్ల రమేశ్ బాబుతో పాటు అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన అడారి ఆనంద్ కుమార్‌ పార్టీని వీడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

వీరిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత వరుపుల రాజా ఇప్పటికే టీడీపీకి గుడ్‌బై చెప్పేశారు. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన రాజా ఓటమిపాలయ్యారు.

అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. గురువారం మీడియా ముందుకు వచ్చారు. తెలుగుదేశంలో కాపులకు సరైన గుర్తింపు లేదని.. ఒక సామాజిక వర్గానికే కొమ్ము కాస్తూ.. వారి చేతుల్లోనే పార్టీ నడుస్తోందని రాజా మండిపడ్డారు.

పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆవేదన చెందుతున్నానని.. జగన్ సంక్షేమ పాలన బాగుందని, అలాగే కాపుల రిజర్వేషన్‌పై సీఎం మొదటి నుంచి ఒకే స్టాండ్‌తో ఉన్నారని రాజా కొనియాడారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.

ఇక మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ సైతం టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందుకోసం ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నారు. మూడు దశాబ్ధాల నుంచి టీడీపీ గుప్పిట్లో ఉన్న విశాఖ డైరీని కైవసం చేసుకోవాలని జగన్ నిర్ణయించారు.

ఈ క్రమంలో విశాఖ డైరీ ఛైర్మన్ అడారి తులసీరావు తనయుడు ఆనంద్ కుమార్‌తో పాటు కుమార్తె యలమంచిలి మునిసిపల్ మాజీ ఛైర్‌పర్సన్ పిళ్లా రమాకుమారిని పార్టీలోకి లాగేందుకు విజయసాయిరెడ్డి తెర వెనుక మంత్రాంగం నడిపినట్లుగా తెలుస్తోంది.

అడారి కుటుంబం సెప్టెంబర్ 1న విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనుంది. విజయసాయికి కుడిభుజంగా ఉంటున్న ఒక సీనియర్ ఆడిటర్ మొత్తం వ్యవహారాన్ని పూర్తి చేసినట్లు లోటస్‌పాండ్ టాక్.

అడారి పార్టీ మార్పు గురించి తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయనను బుజ్జగించే బాధ్యతను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి అప్పగించినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాల రైతుల్లో మంచి పట్టున్న విశాఖ డైరీ పాలకవర్గం వైసీపీ చేతుల్లోకి వస్తే.. ఆ ప్రాంతంపై మరింత పట్టును పెంచుకోవచ్చన్నది జగన్ ఎత్తుగడగా తెలుస్తోంది. 

బాబుకి షాక్: వైసీపీలోకి అడారి ఆనంద్, విశాఖ డైరీ ఇక ఫ్యాన్ గుప్పిట్లోకి

తూర్పులో బాబుకు షాక్: టీడీపీకి వరుపుల రాజా గుడ్‌బై

Follow Us:
Download App:
  • android
  • ios