తిరుపతి: తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ డాక్టర్ శివప్రసాద్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ నిన్న మధ్యాహ్నం అకాల మరణం చెందారు. ఆయన భౌతిక కాయం వద్ద నివాళులర్పించేందుకు ఎందరో ప్రముఖులు తరలి వస్తున్నారు. ఇలా వచ్చిన వారు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ శోకసంద్రంలో మునిగిపోతున్నారు. 

ఇలా ఒకరు శివప్రసాద్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని విషయాలను చెప్పాడు. ఈ విషయాలను పరిశీలిస్తే, శివప్రసాద్ కు కేవలం తెలుగుదేశం పార్టీతోనే కాకుండా అన్ని పార్టీలకు చెందిన నేతలతోని సన్నిహిత సంబంధాలున్నాయని తెలుస్తుంది. ఆయనకు పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ మాత్రమే కాకుండా కాంగ్రెస్ కూడా అవకాశమిస్తామన్నాయట.  

టీడీపీ తొలిసారి టికెట్ ఇస్తామన్నప్పుడు శివప్రసాద్ ప్రేమతపస్సు  సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాపై ఉన్న మమకారం కారణంగా టికెట్ నిరాకరించాడంట.మరోసారి కాంగ్రెస్ టికెట్ ఇస్తామని చెబితే శివప్రసాద్ పోటీకి కూడా సిద్ధపడ్డాడట. కాకపోతే చివరి నిముషంలో నేదురుమల్లి జనార్దన్  రెడ్డి అడ్డుపడటంతో ఆ సారి పోటీ చేయలేకపోయాడట. 

వైఎస్ రాజారెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాలవల్ల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పెళ్ళికి 1996లో ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తో కలిసి 100 వాహనాల్లో జనాలను తీసుకొని పోయాడట.