Asianet News TeluguAsianet News Telugu

శెభాష్ పవన్ కళ్యాణ్.. 9 నెలల మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు.. జమ్మూలో యువతి ఆచూకీ లభ్యం

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ తల్లి తమ కుమార్తె మిస్సయ్యిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మొరపెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన సూచనలతో పోలీసు యంత్రాంగం కదిలింది. ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి యువతి జమ్మూలో ఉన్నట్లు కనిపెట్టారు.

Shebash Pawan Kalyan.. The policeman who solved the case of missing for 9 months GVR
Author
First Published Jul 3, 2024, 8:42 AM IST

ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిండు జీవితాన్ని కాపాడారు. తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని కనిపెట్టి.. తల్లిదండ్రులను వేదన నుంచి బయటపడేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చొరవ కదిలిన యంత్రాంగం.. రోజుల వ్యవధిలోనే ఈ మిస్సింగ్‌ కేసును చేధించడం విశేషం..

మనసు ఉంటే మార్గం ఉంటుందంటారు. చేయాలన్న తపన ఉంటే చేవ కలిగిన వారికి కొదవ లేదంటారు పెద్దలు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 30వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ప్రతిపక్ష హోదాలో పవన్ కళ్యాణ్ ఎంత గొంతు చించుకున్నా ప్రభుత్వంలో చలనం రాలేదు. కనీసం ఒక ప్రెస్ మీట్, సమీక్ష చేయలేదు. 
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓ తల్లి తమ కుమార్తె మిస్సయ్యిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మొరపెట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన సూచనలతో పోలీసు యంత్రాంగం కదిలింది. ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి యువతి జమ్మూలో ఉన్నట్లు కనిపెట్టారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందం జమ్మూ వెళ్లి యువతిని రాష్ట్రానికి తీసుకురావడంతో కథ సుఖాంతం అయ్యింది.

భీమవరానికి చెందిన దంపతులు తమ కుమార్తె 9 నెలల క్రితం అదృశ్యం అయ్యింది. దీనికి సంబంధించి యువతి కనిపించకుండా పోయిన ప్రాంతం విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండడంతో మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశామని పవన్ కళ్యాణ్‌కు చెప్పారు బాధిత తల్లిదండ్రులు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, మీరే చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. తమ కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ఎదుట విలపించారు. ఆ తల్లి రోదనలు విని చలించిన పవన్ కళ్యాణ్ తక్షణం తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన మాచవరం సీఐతో, విజయవాడ పోలీస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కేసుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. 

పోలీసులు  అంతే వేగంగా కదిలారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బాలిక ఆచూకీ కనుగొన్నారు. వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన గాలింపు ఫలించి జమ్మూలో ఆ బాలిక ఉన్నట్టు తెలుసుకున్నారు. ఆచూకీ కనుగొనేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం బాలికను తీసుకువస్తున్న విషయాన్ని విజయవాడ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు మంగళవారం కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షలో ఉండగా తెలిపారు. సమీక్ష మధ్యలోనే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పోలీసు ఉన్నతాధికారితో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. యువతి ఆచూకీ కనుగొన్న పోలీసు శాఖకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేశారు. ఆడబిడ్డల అదృశ్యంపై కేసులు నమోదైతే అశ్రద్ద చేయవద్దని ఈ సందర్భంగా కోరారు. పోలీసు వ్యవస్థతో పని చేయించుకుంటే ఆ శాఖలో అద్భుత అధికారులు ఉన్నారని పోలీస్ శాఖ పని తీరుని కొనియాడారు.

 


లవ్ ట్రాప్ వేసి వేధిస్తే ఫిర్యాదు చేయండి
అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. యువతి అదృశ్యం కేసు ఛేదించిన పోలీసులను అభినందించారు. ఆడపిల్లలు కనిపించకపోతే 24 గంటల్లోపు ఫిర్యాదు చేసి విచారణ వేగంగా మొదలుపెడితే ప్రయోజనం ఉంటుందన్నారు. యువతులను లవ్ ట్రాప్ చేసి ఈ విధమైన నేరాలు చేస్తున్నారని... అలా చేసేవారి పట్ల ఆడపిల్లలు, ఆడపిల్లల తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా ప్రేమ పేరుతో వేధిస్తే తక్షణమే ఫిర్యాదు చేయాలన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios